సింగ‌రేణి ప్రాంత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

-ప్ర‌భుత్వ‌, సింగ‌రేణి అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయండి
-త్వరలోనే ఐదో విడత ఇండ్ల పట్టాల పంపిణీ
-ఖాళీ క్వార్ట‌ర్ల కేటాయింపు తొలి ప్రాధాన్యత రిటైర్డ్ సింగరేణి కార్మికులకే
-స‌మీక్షా స‌మావేశం నిర్వహించిన ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌

Balka Suman: సింగ‌రేణి ప్రాంతంలో ఉన్న స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో సింగ‌రేణి ప్రాంత సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావలసిన సింగరేణి భూములు రెవిన్యూ శాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే సింగరేణి రెవెన్యూకి అప్పగించిన భూములలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మహిళా భవన్, బతుకమ్మ గ్రౌండ్స్, కమ్యూనిటీ భవనాలు తదితర నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాన్నారు.

జీవో 76 ద్వారా రామకృష్ణాపూర్ లో ఇప్పటివరకు 1972 మందికి సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. త్వరలోనే ఐదో విడత ఇండ్ల పట్టాల పంపిణీ ఉంటుందని బాల్క వెల్ల‌డించారు. బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాలలో ఉన్న 8,252 క్వార్టర్ల‌లో సింగరేణి అవసరాలకు, కార్మికులకు సరిపడా కేటాయించగా మిగిలిన‌వి నిరుపేదలకు అందించడానికి సహకరించాలని కోరారు. క్వార్టర్ల‌ కేటాయింపులో తొలి ప్రాధాన్యత రిటైర్డ్ సింగరేణి కార్మికులకే ఉంటుందని ప్రత్యేకంగా సూచించారు. ఈ విషయమై కార్మికులు ఎలాంటి వదంతులు నమ్మొద్దని తెలిపారు.

శిథిలావస్థలో ఉన్న సింగరేణి క్వార్టర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఇప్పటికే పాడుబడ్డ క్వార్టర్స్ లో అసాంఘిక కార్యకలాపాలతో పాటు, విష సర్పాలకు, జంతువులకు ఆవాసంగా మారి ప్రజలకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. సింగరేణి ఏరియాలలో శానిటేషన్ వ్యవస్థ మరింత మెరుగుపరుచుకోవాలని సింగరేణి అధికారులకు సూచించారు. సింగరేణి, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేసుకోవాలన్నారు.

సింగరేణి ఏరియాలలో నివాసముండే కార్మికేతర కుటుంబాలకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి విషయాల్లో మానవతాదృక్పథంతో చూడాలని కోరారు. సింగరేణి ఏరియాలలో అదనంగా పార్కులు, చిల్డ్రన్స్ ప్లేగ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని విప్ సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. మున్సిపల్, అధికారులు సింగరేణి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని చెప్పారు.

అవసరానికి తగ్గట్టుగా ఒకరికొకరు సమన్వయతో పనిచేయడం వల్ల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంటుందని బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. ఈ సమావేశంలో సింగ‌రేణి డైరెక్ట‌ర్ బలరాం నాయక్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవరెడ్డి, మందమర్రి, రామకృష్ణాపూర్ మున్సిపల్ కమిషనర్లు రాజు, వెంకటనారాయణ, మందమర్రి తహసిల్దార్ శ్రీనివాస్, మందమర్రి ఏరియా జిఎం శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like