మరో కొత్త రాజకీయ పార్టీ
-ప్రారంభించిన గాలి జనార్దన్ రెడ్డి
-కల్యాణ రాజ్య ప్రగతి పక్షగా నామకరణండి
-బీజేపీతో రెండు దశాబ్దాల బంధం తెంచుకున్న మాజీ మంత్రిడి

Another new political party: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంతగా పార్టీ పెడుతున్నారన్న ప్రచారం నిజమేనని తేలిపోయింది. సొంత పార్టీ స్థాపిస్తున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. రెండు దశాబ్దాల పాటు బీజేపీలో కొనసాగుతున్న గాలి.. కొత్త పార్టీ పెట్టడం కర్నాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో గాలి జనార్దన్ రెడ్డి నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పేరుతో ఈ నెల 10న ఢిల్లీలో ఎన్నికల కమిషన్ వద్ద కొత్త పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు.
పార్టీని వీడొద్దని బీజేపీ ప్రయత్నాలు చేసినా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కొత్త పార్టీ వైపే మొగ్గు చూపారు. బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం ఆయన పార్టీని ప్రారంభించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీతో తన సంబంధాలపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను బీజేపీ సభ్యుడిని కాదన్నారు.
కానీ చాలా మంది తాను బీజేపీ వ్యక్తిననే అనుకుంటున్నారని చెప్పారు. ఈ కొత్త పార్టీతో ఆ ప్రచారానికి తెర దించుతున్నట్టు పేర్కొన్నారు. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ పేరుతో, తన ఆలోచనలకు తగినట్లుగా కొత్త పార్టీ ప్రారంభిస్తున్నానని చెప్పారు. తాను గోలీలాటలోనే ఓటమిని ఒప్పుకోలేదన్నారు. అలాంటిది రాజకీయాల్లో ఎలా ఓటమిని ఒప్పుకుంటానన్నారు. ఈ పార్టీ ద్వారా ప్రతి పల్లెకు, గడప గడపకు వెళ్తానన్నారు. తనకు ప్రజల ఆశీర్వాదం లభిస్తుందన్నారు. సంక్షేమ రాజ్యంగా కర్ణాటక మారుతుందన్నారు.
బీజేపీ సీనియర్ నేత యడియూరప్పపై తనకు చాలా గౌరవం ఉందన్నారు. ఇప్పటికీ ఆయనపై ఉన్న ప్రేమ, నమ్మకం అలానే ఉన్నాయన్నారు. కానీ కొత్తగా పార్టీ పెట్టడంపై ఆయనతో చర్చించలేదన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో మంత్రిగా ఉన్న శ్రీరాములు, ఆయన సోదరుల్ని బీజేపీ వీడి తన పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేయనన్నారు.