BRS పై పోరాటానికి శంఖారావం
-రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి
-వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
-ఆదిలాబాద్లో బీజేపీ కలెక్టరేట్ ముట్టడిలో నేతల డిమాండ్
BJP collectorate besieged: BRS పై పోరాటానికి బీజేపీ శంఖారావం పూరిస్తోందని నేతలు స్పష్టం చేశారు. మంగళవారం రైతు సమస్యలపై ఆదిలాబాద్లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ రైతులను మాయ మాటలతో మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలన్నారు. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ధరణి పోర్టల్ తో పట్టాలు రాక రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుకోలేకపోతున్నారని అన్నారు.
జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ BRS ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఓట్లు దండుకున్నదని తెలిపారు. ఎన్నికలయ్యాక రైతులను మోసం చేస్తూనే ఉందన్నారు, 2017లో రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షకు లక్ష వడ్డీ అయ్యిందన్నారు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణితో రైతుల భూములు అన్యాక్రాంతం అయ్యాయని స్పష్టం చేశారు. వాటిని సరి చేయడానికి అధికారుల చుట్టూ తిరుగుతూ రైతుల చెప్పులు అరిగిపోతున్నాయని, వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. విసిగి పోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి లేని పక్షంలో ప్రగతి భవన్ ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
అనంతరం బీజేపీ నాయకులు కలెక్టర్ కార్యాలయం లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పొలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్తో సహా కొంత మంది ముఖ్య నాయకులను పోలీసులు అనుమతించారు. మొదట బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులగుండా కొనసాగి కలెక్టర్ కార్యాలయనికి చేరుకుంది. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు దయాకర్, వేణుగోపాల్, అధినత్, మనాజీ, సుహాసిని, విజయ్, అనంత్ రమేష్, మయూర్ చంద్ర, సుభాష్, సంతోష్, దినేష్ మతోలియ, జోగు రవి, సుమ రవి, మహేందర్, బాబురావు, రమేష్, ధోని జ్యోతి, రత్నాకర్ రెడ్డి, నారాయణ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.