సంకాంత్రి తర్వాత ప్రజల్లోకి..
-జనవరి 26 నుంచి పాదయాత్రతో రేవంత్‌రెడ్డి
-రూట్‌మ్యాప్ రెడీ చేసిన పార్టీ శ్రేణులు
-భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు
-షర్మిల పాదయాత్ర సైతం పునఃప్రారంభం
-నియోజకవర్గాల పర్యటనలతో ప్రజల్లోకి బండి సంజయ్
Leaders into the people after Sankantri: సంకాంత్రి పండగ తర్వాత తెలంగాణలో రాజకీయ వేడి మొదలు కానుంది. ఆయా పార్టీల పెద్దలు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో నేతలంతా ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు సైతం పూర్తి చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పుణ్యక్షేత్రం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు రేవంత్ పాదయాత్ర సాగుతుందని అంటున్నారు. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభతో రేవంత్ పాదయాత్రకు ముగింపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’గా నామకరణం చేశారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా దీనిని చేపడుతున్నారు.
పాదయాత్ర ఎక్కడ నుంచి ప్రారంభించాలి? ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లాలి? కార్నర్ మీటింగ్‌లు ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎక్కడ ముగించాలి? అనే దానిపై కసరత్తు జరుగుతోంది. ఎక్కువ నియోజకవర్గాల గూండా వెళ్లే విధంగా రేవంత్ పాదయాత్రకు రూట్‌మ్యాప్ రెడీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో టచ్ చేసిన నియోజకవర్గాల్లో కాకుండా మిగతా నియోజకవర్గాల గుండా వెళ్లేలా రేవంత్ పాదయాత్రకు రూట్‌మ్యాప్ సిద్దం చేస్తున్నారు. తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు ఉండటంతో.. ఆరు నెలల పాటు పాదయాత్ర చేయాలని రేవంత్ నిర్ణయించారు.
ఇక వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంక్రాంతి తర్వాత తన పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడి, ఆమె అరెస్ట్ లాంటి పరిణామాలతో ఆగిపోయిన పాదయాత్ర సంక్రాంతి తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. ప్రభుత్వం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపై మాటల దాడి చేస్తూ పాదయాత్ర చేస్తుండటంతో ఆమె పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. నర్సంపేట ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలతో హనుమకొండ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరంతండా వద్ద షర్మిల పాదయాత్ర బస్సుపై దాడి చేశారు. కిరోసిన్ పోసి.. బస్సును కాల్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన షర్మిల తిరిగి అక్కడ నుంచే పాదయాత్ర చేపట్టనున్నారు.
ఇక ఐదు విడతలుగా పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లిన బండి సంజయ్ నియోజకవర్గ పర్యటలను చేపట్టనున్నారు. సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల పర్యటనలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించి బహిరంగ సభలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. మిషన్ 90 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలవడమే లక్ష్యంగా జనవరి నుంచి మరింత వేగం పెంచనుంది.