తెలంగాణలో మరో అధికార కేంద్రం

హుజురాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణలో మరో అధికార కేంద్రానికి దారి తీశాయా..? ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌నే ఢీకొన్న ఈటెల రాజేందర్ రాబోయే రోజుల్లో సెంటర్ అట్రాక్షన్ కానున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈటెల రాజేందర్ గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా హీరో అయ్యారు. హుజురాబాద్‌లో జరిగిన ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్‌గా మారడం అందులో గెలుపొందడంతో ఆయన సత్తా తేలిపోయింది. అవి రాజేందర్ గెలుపుతో పాటు భారతీయ జనతా పార్టీకి సైతం ఊపు వచ్చింది. 2004లో రాజకీయాల్లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గానికి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి అనేది ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. ఆయన గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనబడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి మంచి పట్టు దొరికినట్లయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కమలం పార్టీ ఇంకా బలోపేతం అయి అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు భారతీయ జనతా పార్టీ పవర్ సెంటర్‌గా ఈటెల రాజేందర్ నిలువనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు, ఉద్యమ కారులను ఏకం చేయడంతో పాటు టీఆర్ ఎస్‌లో అసంతృప్తవాదులను సైతం ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. దానికి ఈటెల రాజేందర్‌ను అస్త్రంగా వాడుకోనున్నారు. శనివారం ఆయన డిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, తరుణ్‌చుగ్ లాంటి నేతలను కలుస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలోపేతంపై నేతలు దృష్టి సారిస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని నిరూపించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి తమ పార్టీలో మంచి ప్రయారిటీ ఉంటుందని ఈటెల ఎపిసోడ్ ద్వారా వారు మిగతా నేతలకు స్పష్టం చేసేందుకు ఆయనకు మంచి స్థానం కల్పిస్తున్నారు. తమను నమ్ముకుని వచ్చిన ఈటెలకు మంచి చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగానూ బీజేపీకి గ్రాఫ్ బాగా పెరుగుతుందని నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.