సింగరేణి సిగలో మరో రెండు రికార్డులు
-ఒక్క డిసెంబర్ నెలలోనే 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
-రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల రవాణా
-ఇకపై రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా ఉత్పత్తి, రవాణా జరపాలి
-అన్ని ఏరియాల జీఎంల సమీక్ష సమావేశంలో సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్

Singareni Records: సింగరేణి సంస్థ తాజాగా మరో రెండు రికార్డులు సాధించింది. డిసెంబర్ నెలలో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఇది గత ఏడాది డిసెంబర్ నెలలో సాధించిన దానికన్నా 19 శాతం అధికం. అదే సమయంలో సగటున రోజుకు 2 లక్షల 18 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపి మరో ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. ఈ విషయాన్ని సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ వెల్లడించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం ఆయన సింగరేణి డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో డిసెంబర్ నెల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత 2021 డిసెంబర్లో 56.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్లో 19 శాతం వృద్ధితో 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. అలాగే గత డిసెంబర్లో 37.37 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్లో 24.47 శాతం వృద్ధితో 47 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించామని తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 80 రోజులు చాలా కీలకమని, రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని కోరారు. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా నమోదు చేయనున్నామన్నారు. అత్యధికంగా 34 వేల కోట్లకు పైబడి టర్నోవర్, అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మణుగురు, కొత్తగూడెం, రామగుండం రీజియన్, అడ్రియాల ప్రాజెక్టుల నుండి గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవాణా జరగడం పైన తన సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ఏరియాలు ఇదే ఒరవడితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ నెలలో సాధించిన ప్రగతిపై ఆయన హర్షం ప్రకటిస్తూ కార్మికులు, అధికారులకు తన అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ పా ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ బలరాం, డైరెక్టర్ ఇఅండ్ఎం సత్యనారాయణ రావు, ఈడీ కోల్ మూమెంట్ జె. ఆల్విన్, అడ్వయిజర్ మైనింగ్ డి.ఎన్. ప్రసాద్, అడ్వయిజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం. సురేష్, జనరల్ మేనేజర్ (పి అండ్ పి) సి.హెచ్. నర్సింహ రావు, జనరల్ మేనేజర్ మర్కెటింగ్ కె. సూర్యనారాయణ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.