మళ్లీ నంబర్-1 మనమే…
-జాతీయ స్థాయిలో మరోసారి వెలిగిన సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్
-91.15 పీఎల్ఎఫ్ తో ప్రతిభ చాటిన ఎస్టీపీపీ
-ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికాంతానికి దేశంలో అగ్రస్థానం
-అభినందనలు తెలిపిన సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్
Singareni Thermal Power Plant: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికాంతానికి మరోసారి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచి తన ప్రతిభ చాటింది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ దేశంలోని అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితా రూపొందించింది. ఇందులో అత్యధికంగా 91.15 శాతం పీఎల్ఎఫ్ తో సింగరేణి థర్మల్ ప్లాంట్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశంలో సుమారు 250కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల పీఎల్ఎఫ్ లను దాటి సింగరేణి థర్మల్ ప్లాంట్ ఈ స్థానాన్ని అందుకోవడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండో సారి. దీనిపై సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ తన హర్షం ప్రకటిస్తూ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తమ సంస్థ జాతీయ స్థానంలో అగ్రస్థానంలో నిలవడం తమకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అతి తక్కువ సమయంలో అగ్రస్థానానికి..
2016 ఆగస్టు లో ప్రారంభమైన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కేవలం ఆరు సంవత్సరాల కాలంలోనే అద్భుతమైన ప్రతిభతో దేశంలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. కరోనా సమయంలో మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో అత్యధిక పీఎల్ఎఫ్ సాధిస్తూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో గత నవంబరు నెల నుంచి ప్రభుత్వ సంస్థలతో పాటు అన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న 250కి పైగా ఉన్న థర్మల్ కేంద్రాల కన్నా అత్యధిక పీఎల్ఎఫ్ నమోదు చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. దేశంలో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ సంస్థలైన ఎన్టీపీసీ, అదానీ, టాటా, రిలయన్స్, జిందాల్ తదితర సంస్థలను కూడా దాటి నెంబర్ వన్ గా నిలవడం గమనార్హం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే పవర్ప్లాంట్ లేదు..
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెల్లడించిన నివేదికలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 7219 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో 91.15 పీఎల్ఎఫ్ తో ప్రథమ స్థానంలో నిలవగా.. తర్వాత స్థానంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన ఎస్టీపీసీ కోర్భా ప్లాంట్ నిలిచింది. మూడో స్థానంలో ఎస్టీపీసీ సింగ్రౌలి ( ఉత్తర ప్రదేశ్ ) ప్లాంట్ నిలిచింది. నాలుగో స్థానంలో వింధ్యాచల్ ప్లాంట్(మధ్య ప్రదేశ్), ఐదో స్థానంలో బక్రేశ్వర్ ప్లాంట్ (పశ్చిమ బెంగాల్), ఆరో స్థానంలో రిహాంద్ ప్లాంట్( ఉత్తర ప్రదేశ్) నిలిచాయి. సీఈఏ ప్రచురించిన 25 అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరే ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ ప్లాంట్ కు చోటు దక్కలేదు.
రాష్ట్ర ప్రగతికి విద్యుత్… సింగరేణికి లాభాలు..
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తన వంతు పాత్ర సమర్థంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం 52,328 మిలియన్ యూనిట్ల విద్యుత్ గ్రిడ్ కు అందించింది. తెలంగాణ వినియోగిస్తున్న మొత్తం విద్యుత్ లో 12 శాతాన్ని సమకూర్చుతోంది. సింగరేణి సంస్థకు ఏటా సగటున 400 కోట్ల రూపాయలకు పైగా లాభాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాంట్ లో ఉన్న రెండు యూనిట్లు అత్యంత సమర్థంగా పనిచేస్తుండటం మరో విశేషం. నెలావారీ పనితీరును పరిశీలిస్తే రెండో యూనిట్ ఇప్పటికి 10 సార్లు వంద శాతం పీఎల్ఎఫ్ దాటి విద్యుత్ ఉత్పత్తి చేసింది. కాగా, మొదటి ప్లాంట్ ఎనిమిది సార్లు నూరు శాతం పీఎల్ఎఫ్ దాటడం విశేషం. మొత్తమ్మీద సింగరేణి థర్మల్ ప్లాంట్ ఇప్పటికి నాలుగుసార్లు వంద శాతం పైబడి పీఎల్ఎఫ్ ను సాధించింది.