సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభోత్సవం

Telangana Secretariat: కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సచివాలయం నిర్మిస్తోంది. రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్ చేశారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని ఖరారు చేశారు.
అయితే, ఇప్పటికీ సచివాలయ నిర్మాణం ఇంకా పూర్తవలేదు. నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. వీలైతే మొత్తం భవనం లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్తుతో పాటు , సాధారణ పరిపాలనాశాఖ కోసం మరో అంతస్తు సిద్ధం చేసి ప్రారంభిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ప్రధాన ప్రవేశద్వారం, పోర్టికో వంటి పనులు జరుగుతున్నాయి. భవనం ముందు విశాలంగా ఉండేలా పచ్చికబయళ్లు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు సమాంతరంగా సాగుతున్నాయి.
కార్మికులు మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తరచూ సచివాలయ పనులు పరిశీలిస్తూ పురోగతిని తెలుసుకోవడం సహా వేగవంతానికి ఆదేశాలిస్తున్నారు. వీలైనంత త్వరగా పనులన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.