ఎమ్మెల్యే రేసులో తెరపైకి కొత్త పేరు..
Bellampalli: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎప్పుడూ వినపడని పేర్లు సైతం వినిపిస్తున్నాయి. డబ్బులు, కాస్తా పలుకుబడి ఉంటే చాలు తాము ఎమ్మెల్యే పోటీలో ఉంటామని అధిష్టానానికి వర్తమానం పంపిస్తున్నారు. తమకు నమ్మకం ఉన్న కొందరు నేతల ద్వారా టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
బెల్లంపల్లి కాంగ్రెస్‌లో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నేతలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు గడ్డం వినోద్ కార్యకర్తలను సమాయత్తం అయ్యారు. ఇక ఎప్పటి నుంచో ఇక్కడ స్థానిక నేత చిలుముల శంకర్ సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు టిక్కెట్టు రావాలని వారు ముందుకు సాగుతున్నారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతతో తాము రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే అదే సమయంలో కొందరు కొత్త నాయకుల పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఐకేపీ ఉద్యోగి ఒకరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక నేతలు కొందరు అతన్ని పోటీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. కొద్ది రోజులుగా నాతరి స్వామి అలియాస్ ఎల్లయ్య అనే వ్యక్తిని తెరపైకి తీసుకువస్తున్నారు. ఆయన కూడా ఉత్సాహంగా ఉండటంతో పెద్ద నేతలను కలిసే పనిలో పడ్డారు. ఎల్లయ్యను బెల్లంపల్లికి చెందిన నేత ఒకరు గాంధీభవన్‌లో పలువురు నేతలకు కలిపించినట్లు సమాచారం. కొద్ది రోజులుగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఆయన పేరు నానుతోంది.
ఐకేపీ ఉద్యోగిగా చేస్తున్న ఎల్లయ్యను స్థానిక నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చిలుముల శంకర్ వ్యతిరేక వర్గం ఆయనను బరిలో దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శంకర్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రత్యామ్నాయ అభ్యర్థి కాదని అందుకే ఎల్లయ్యను రంగంలోకి దించుదామని ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావును కలిసి ఈ విషయంలో హామీ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ నేతల కృషి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఒకవేళ హామీ లభించినా కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలు కలిసికట్టుగా ముందుకు వచ్చి ఆయనకు మద్దతు చెబుతాయా..? లేదా..? అన్నది కూడా ప్రశ్నార్థకమే.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల వరకు ఎవరు పోటీలో ఉంటారు.. ఎవరికి టిక్కెట్టు వస్తుంది…? ఇలా ఎన్నో రకాలైన ప్రశ్నల నడుమ ఎవరికి వారు సైతం టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.