కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్కారు గుడ్ న్యూస్
-అదనంగా 7 మార్కులు కలిపేలా నిర్ణయం
-ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
-ఉత్తీర్ణులైన వారి జాబితా 30 నుంచి వెబ్సైట్లో
Telangana: కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫలితాల్లో ఏడు మార్కులు అదనంగా కలపాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. అయితే కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలున్నాయి. అయితే బోర్డు మాత్రం తాము నిర్ధారించుకున్న జవాబుల ప్రకారం మార్కులు వేసి ఫలితాలు వెల్లడించింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లను పరిశీలించిన కోర్టు బహుళ జవాబులున్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం కూడా ఓకే చెప్పడంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 7 మార్కులు కలపనుంది. క్వాలిఫై అయిన వారికి ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. కోర్టు తీర్పుతో మరికొందరు తర్వాత దశకు ఎంపిక కానున్నారు. అదనంగా ఎంపియ్యే వారి వివరాలను రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. హాల్ టికెట్ నంబర్లతోనే అభ్యర్థులు లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు.
ఫిబ్రవరి 1 నుంచి పార్ట్-2 దరఖాస్తులు ప్రారంభమవుతాయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 5 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పార్ట్-2కు దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10 రాత్రి 12 గంటల వరకు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది.