స్కూల్ బస్సుకు ప్రమాదం..
-ఆరా తీసిన మంత్రి కేటీఆర్
-అవసరమైతే హైదరాబాద్ తరలించాలని ఆదేశం
Accident to school bus: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్సుకు ప్రమాదం సంభవించింది. సిరిసిల్ల వచ్చే దారిలో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. రెండు బస్సులు ఒకే వైపు నుండి వస్తున్నాయని, ఆర్టీసీ బస్ డ్రైవర్ స్కూల్ బస్సును ఢీకొనడంతోనే పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. అప్రమత్తమైన స్థానికులు గాయపడ్డ పిల్లలను హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్….
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదంపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు.