నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం
11 ఫైరింజన్లతో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
Fire in New Secretariat: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుఝామున 3:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. కొత్త సచివాలయం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. భవనం కుడివైపు కొద్ది సేపు మంటలు ఎగబాకాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే సచివాలయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి గంటన్నర సమయంలోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే కొత్త సచివాలయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఎన్ టీఆర్ మార్గ్ రోడ్డును రెండు వైపులా మూసివేశారు. దీంతో ఉదయం పూట వెళ్లే వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉడ్ వర్క్ జరుగుతున్న చోట షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.