కౌంటర్… ఎన్‌కౌంటర్..
-వేడి వేడిగా అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు
-శాసనసభలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం
-మండలిలో జీవన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వావాదం
Telangana Assembly :తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు శనివారం వాడిగా, వేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు నిలదీస్తుండటం వాటికి ధీటుగా అధికార పక్షం బదులిస్తోంది. రెండింటిలోనూ సభ్యుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సమయంలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎంగా మారింది. అసెంబ్లీలో అన్నీ చెబుతారు.. బయట నెరవేర్చరంటూ MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాతబస్తీకి మెట్రో సంగతేంటి?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ నిలదీశారు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవనివ్వడం లేదని, మీరు కనీసం చెప్రాసీని చూపిస్తే వారినైనా కలుస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ కల్పించుకుని కేవలం ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఎక్కువ సమయం కేటాయించడం సరికాదన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని దుయ్యబట్టారు. అక్బరుద్దీన్ ఒవైసీ బీఏసీ సమావేశానికి రాకుండా మాట్లాడడం సరికాదని స్పష్టం చేశారు. మంత్రులు అందుబాటులో లేరనడం కరెక్ట్ కాదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇక శాసనమండలిలో సైతం వాడీవేడీగా చర్చ సాగింది. 24గంటల ఉచిత విద్యుత్ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. కరెంట్ రావడం లేదని కొందరు సైకో ఫ్యాన్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన జీవన్ రెడ్డి.. క్షేత్రస్థాయిలో చూస్తే కరెంట్ ఎప్పుడూ వస్తుందో.. ఎప్పుడూ పోతుందో రైతులకు, విద్యుత్ శాఖ సిబ్బందికి కూడా తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ రావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. తాను సీఎండీ ప్రభాకర్‌రావుతో మాట్లాడిన అని, పూర్థిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయట్లేదని సీఎండీ చెప్పారని అన్నారు. 24 గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అయినట్టుగా తెలిస్తే క్షమాపణలు చెబుతానన్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కాసేపు వాగ్వావాదం చోటు చేసుకుంది.