డిపిఆర్ఓ తీరుపై జర్నలిస్టుల నిరసన
క్షమాపణ చెప్పాలని టీయూడబ్ల్యూజే డిమాండ్
Adilabad: ఆదిలాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) భీమ్ కుమార్ జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శిస్తున్నారని కవరేజ్ కోసం రావాలని డిపిఆర్ఓ సమాచారం ఇచ్చారు. కెమెరామెన్లు, జర్నలిస్టులు అక్కడికి చేరుకున్నారు. రిమ్స్ లో కలెక్టర్ ఫోటోలు తీస్తున్న నమస్తే తెలంగాణ స్టాఫ్ కెమెరామెన్ రాజ్ కిరణ్ కెమెరాను డిపిఆర్ఓ లాక్కోవడమే కాక దురుసుగా ప్రవర్తించారు. ఆయన తీరును పలువురు జర్నలిస్టులు ఖండించారు. టీయూడబ్ల్యూజే (H143) అదిలాబాద్ జిల్లా శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిపిఆర్ఓ తీరు నిరసిస్తూ కలెక్టర్ కి ఫిర్యాదు చేయడమే గాక అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛ హరించేలా, జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా డిపిఆర్ఓ అనుసరిస్తున్న వ్యవహార శైలి కలెక్టర్ కు వివరించారు. డిపిఆర్ఓ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని యూనియన్ నాయకులు కోరారు. అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బేత రమేష్, జర్నలిస్టు ప్రతినిధులు రఘునాథ్, అంజయ్య, సుధాకర్, దత్తాత్రి, పవన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.