సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా..
Telangana : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి తన పుట్టిన రోజు సందర్భంగా దీనిని ఈ నెల 17న ప్రారంభించాల్సి ఉంది. ఈ కొత్త సచివాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని, ప్రారంభోత్సవం తర్వాత భారీ బహిరంగ సభకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ సభకు ఇతర రాష్ట్రాల నేతలను కూడా పిలిచేలా ప్లాన్ చేశారు. కార్యక్రమానికి అతిథులుగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురిని ఆహ్వానించారు.
అయితే తాజాగా నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
త్వరలోనే నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. 20 ఎకరాల స్థలంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో ఈ నూతన సచివాలయం అధునాతనంగా నిర్మాణం చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి.