పైన వడ్ల బస్తాలు.. కింద నకిలీ పత్తి విత్తనాలు
-చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
-ముగ్గురు నిందితుల అరెస్ట్, పరారీలో ఇద్దరు
-5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, బొలెరో, కారు స్వాధీనం
Manchiryal: టాస్క్ఫోర్స్ పోలీసుల దాడుల్లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, మహేంద్ర బొలేరోతో పాటు కారు సైతం స్వాధీనం చేసుకున్నారు.
దీనికి సంబంధించిన వివరాలను టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కల్తీ, నకిలీ విత్తనాలు రూపుమాపి రైతులకు అండగా నిలిచేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. అందులో భాగంగా కొందరు వ్యక్తులు తాండూరు పోలీస్స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దానిపై పూర్తిగా నిఘా పెట్టగా శనివారం బోయపల్లి బోర్డు వద్ద కొన్ని వాహనాలు తనిఖీ చేశామన్నారు. మంచిర్యాల వైపు వెళ్తున్న బొలెరో ట్రాలీ వాహనం లో పైన వడ్ల బస్తాలు వేసుకొని వాటి కింద సుమారు 10,00000/- విలువైన 5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత (బిటి-3) నకిలీ విత్తనాలు గుర్తించినట్లు వెల్లడించారు.
వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను విచారించగా తాండూరు మండలానికి చెందిన కొడిపాక రంజిత్, గాండ్ల మహేష్ అనే వ్యక్తులు తమకు అమ్మినట్లు అంగీకరించారు. వీరిద్దరు పరారీలో ఉన్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ వెల్లడించారు. ఈ సందర్భంగా పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్న శ్రీరాముల నవీన్ (డ్రైవర్,రేచిని), ఒడ్నాల రాకేష్ (వ్యవసాయం, కొమురవెల్లి), మోర్ల వెంకట స్వామి(వ్యవసాయం,భీమిని)అను అరెస్టు చేశామన్నారు. విచారణ నిమిత్తం బోలోరే ట్రాలీ, ఎస్కార్ట్ గా ఉపయోగించిన కారు, నకిలీ (BT) విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితులను తాండూర్ పోలీస్లకు అప్పగించినట్లు స్పష్టం చేశారు.
ఈ దాడిలో సీపీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తో పాటు ఎస్సై లచ్చన్న, సిబ్బంది పాల్గొన్నారు.