ఎమ్మెల్యే చిన్నయ్య క్షమాపణ చెప్పాలి

Bellampalli: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మతిస్థిమితం లేని, అహంకార వైఖరితో అనుచిత వాఖ్యలు చేస్తున్నార‌ని, భారత కమ్యూనిస్టు పార్టీకి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో సీపీఐకి వెయ్యి ఓట్లు రావని చిన్న‌య్య అన‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. నియోజకవర్గం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి ఎంఎల్ఎ గుండా మల్లేష్ అని గుర్తు చేశారు. ఈ ప్రాంతం నుండి 4సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన‌నారు. సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లేష్ వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా దేశ, రాష్ట్ర, ప్రజల ప్రయోజనాల కోసం పని చేశారని చెప్పారు. ఆయన ఇక్కడ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారని వెల్ల‌డించారు.

దుర్గం చిన్నయ్య వ్యక్తిగత ప్రయోజనాలకు పని చేస్తూ ఆస్తులు కూడబెట్టుకున్నారని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో క‌మ్యూనిస్టులు ముందున్నార‌న్నారు. తెలంగాణ ఏర్పాటు విష‌యంలో గల్లీ నుండి ఢిల్లీకి ప్రజల గొంతు వినిపించి, శ్రీకృష్ణ కమిటికి తెలంగాణ అనుకూల నివేదిక అందించింద‌న్నారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని అధికారాన్ని సాధించిన వారికి ఇవీన్నీ అవగాహన లేకుండా పోయిందన్నారు. చేసిన వాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని లేకుంటే భారత కమ్యూనిస్తు పార్టీ తగిన రీతిలో బుద్ది చెప్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్, జిల్లా నాయకులు మేకల దాసు, మిట్టపల్లి వెంకటస్వామి, దాగం మల్లేష్, మిట్టపల్లి శ్రీనివాస్, చిప్ప నర్సయ్య, జోగుల మల్లయ్య, బియ్యాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like