అధిష్టానానికి అల్టిమేటం..
మూడు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి - లేకపోతే ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు - ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోంది - కాంగ్రెస్ కోసం కోట్లు ఖర్చు చేశా.. అయినా మోసం చేస్తున్నారు - సూట్‌కేస్ నేతకు పదవి ఇస్తారా..? మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ఆగ్రహం
కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులను పార్టీ నాయకత్వం విస్మరిస్తోందని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు స్పష్టం చేశారు. ఆయన శనివారం మాట్లాడుతూ మొదటి నుంచి ఉత్తర తెలంగాణ కు కాంగ్రెస్ నాయకత్వం అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువ నాయకుడు శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని వెల్లడించారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి పని చేశానని, అయినా తనను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లిలో సభ అన్నారని దానికి సంబంధించి ఒక్క రూపాయి ఇచ్చినోడు లేడన్నారు. ఉమ్మడి జిల్లాలో తనపై ఉన్న నమ్మకం పోవద్దనే ఉద్దేశంతో రూ. 2 కోట్లు ఖర్చు చేసి సభ విజయవంతం చేస్తే సభ లో కొందరు తన పేరు కూడా ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు వచ్చాయి ఇంత కంటే హీనమైన పరిస్థితి ఉందా..? ఇదంతా రేవంత్ రెడ్డి దయ అని స్పష్టం చేశారు. ఇలానే వెళ్తే గత ఎన్నికల్లో 19 సీట్లు వచ్చాయి ఈ సారి ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లెదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నుండి మూడు సార్లు బయటికి వెళ్లొచ్చిన సూట్ కేస్ నేత మాజీ మంత్రి వినోద్ కు క్రమశిక్షణ కమిటీ లో చోటిస్తే పార్టీలో ఎవడైనా ఉంటాడా..? అని ఆయన ప్రశ్నించారు. ఏదైనా కష్టమొస్తే అధ్యక్షుడికి ఫోన్ చేద్దామంటే ఏ ఫోన్ లో ఉంటాడో తెలియదన్నారు. ఇప్పటి వరకు రేవంత్ నంబర్ కూడా నా దగ్గర లేదన్నారు. మాణిక్కం ఠాగూర్ ఒక ప్రిన్సిపాల్ మేం ఎల్కేజీ పిల్లలం అనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి మూడు రోజులు గడువు ఇస్తున్నామని పక్కన పెట్టిన తన కార్యకర్తల విషయంలో నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరా కాంగ్రెస్ పేరుతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.