కాంగ్రెసోళ్లు మళ్లీ కొట్టుకున్నరు..
-బెల్లంపల్లిలో కాంగ్రెస్ నేతల బాహాబాహీ
-కారు అద్దాలు ధ్వంసం, నేతలకు స్వల్ప గాయాలు
Congress : కాంగ్రెస్ నేతలు మళ్లీ కొట్టుకున్నారు. ఆ పార్టీ వాళ్లకు గ్రూపు తగాదాలు కామన్. అప్పుడప్పుడు కొట్టుకోవడం కూడా కామనే. ఇప్పుడు కూడా అక్షరాలా అదే జరిగింది. హాత్ సే హాత్ జోడో పేరుతో పార్టీని బలోపేతం చేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని అధిష్టానం భావిస్తే కింది స్థాయి నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవరిస్తుండటంతో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో రసాభాసా చోటు చేసుకుంది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గోమాస శ్రీనివాస్ వర్గంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు వర్గం దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసం కాగా, ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లిలో బుధవారం టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జీ గోమాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా బెల్లంపల్లికి వచ్చిన గోమాస శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన కొందరు నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. బైరి శ్రీనివాస్, గెల్లి జయరాం యాదవ్, అఫ్జల్ కొద్ది రోజుల కిందట రాజీనామా చేశారు. దీంతో వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. తాజాగా బుధవారం వారిని పార్టీలోకి గోమాస శ్రీనివాస్ ఆహ్వానించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, నాయకులు కార్కూరి రాంచందర్, కేవీ పత్రాప్ తదితరులతో కలిసి అనంతరం ఆయన భారీగా కాన్వాయ్‌తో ఆ కార్యక్రమానికి బయల్దేరారు.
బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మగడ్డ వద్ద పీఎస్ఆర్ వర్గం అడ్డుకుంది. కొద్ది రోజులుగా తాము ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంటే గోమాస శ్రీనివాస్ పెత్తనం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావుకు తెలియకుండా ఇక్కడకు రావటం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యర్థి వర్గంపై దాడి సైతం చేశారు.కేవీ ప్రతాప్ కారు అద్దాలు పగలగా, ఆయన పెదవి సైతం చిట్లింది. మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబుకు గాయాలు అయ్యాయి.