అద్భుత ప్రగతిపై ఆనందం
-మంత్రి కేటీఆర్‌కు సింగరేణి ప్రగతి వివరించిన సీఅండ్ఎండీ
-సంస్థ పురోగతిపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి
-సింగరేణి కార్మికులకు క్వార్టర్ కేటాయింపు పత్రాలు అందజేత
Singareni: సింగరేణి సంస్థ భూపాలపల్లిలో కొత్తగా నిర్మించిన 994 కార్మిక క్వార్టర్ల సముదాయం రామప్ప కాలనీని మంత్రి కె. తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తో సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన సింగరేణీయుల ఆత్మీయుల సమ్మేళనంలో సింగరేణి కార్మికులకు సింగిల్ బెడ్ రూమ్ క్వార్టర్ల స్థానంలో విశాలమైన డబుల్ బెడ్రూంలను నిర్మించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు ఇప్పటి వరకు 2000 క్వార్టర్లను నిర్మించామని సీఅండ్ ఎండీ వెల్లడించారు.
కొత్తగూడెం, సత్తుపల్లిలలో మరిన్ని కొత్త క్వార్టర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గతంలో నిర్మించిన కార్మికుల క్వార్టర్ల వైశాల్యం కేవలం 465 చదరపు అడుగులు ఉండగా, కొత్తగా నిర్మించిన క్వార్టర్ల వైశాల్యం 708 అడుగులు ఉంద మంత్రి కేటీఆర్‌కు చెప్పారు. డబుల్ బెడ్రూంతో పాటు గ్రానైట్‌తో ఏర్పాటు చేసిన కిచెన్ టైల్స్‌తో రూపొందించిన ఫ్లోరింగు, ఆధునిక, సాంప్రదాయ టాయిలెట్స్, రెండు వాహనాలు నిలపడానికి తగినంత పార్కింగ్ ప్రదేశం, ప్రతి క్వార్టర్‌కు 1,000 లీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేశామన్నారు. సింగరేణి సంస్థ అత్యాధునిక సౌకర్యవంతమైన క్వార్టర్లను నిర్మించడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు తమ హర్హం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సింగరేణి ప్రగతి గురించి ఏర్పాటు చేసిన ‘ఫోటో ఎగ్జిబిషన్’ తిలకించారు. సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాధించిన అద్భుత ప్రగతి ఛైర్మన్ శ్రీధర్ వివరించగా సంస్థ ప్రగతి పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో, బొగ్గు రవాణాలో, టర్నోవర్‌లో, లాభాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని ఈ సందర్భంగా సీఎండీ తెలిపారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 92 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర అవసరాల రీత్యా ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించనున్నామని తెలిపారు.
300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా ఇప్పటికే 224 మెగావాట్ల ప్లాంట్లను పూర్తి చేశామని తెలిపారు. ఇటీవలే 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను కూడా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రారంభించామని వివరించారు. పర్యావరణహిత బొగ్గు రవాణా కోసం 54 కిలో మీటర్ల పొడవైన ప్రత్యేక రైలు మార్గాన్ని కొత్తగూడెం – సత్తుపల్లి మధ్య నిర్మించామని మంత్రి కేటీఆర్ కు శ్రీధర్ స్పష్టం చేశారు. దీనికి అనుబంధంగా ఏడాదికి కోటి టన్నుల బొగ్గు రవాణా చేసే సామర్థ్యం గల పర్యావరణహిత సీహెచ్‌పీని కూడా సత్తుపల్లిలో నిర్మించామన్నారు. సింగరేణి ప్రగతిని మంత్రులు ప్రశంసిస్తూ ఇదే ఒరవడితో ముందుకు కొనసాగాలన్నారు.
కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, ఏఐటీయూసీ నాయకులు రాజ్‌కుమార్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిని, గండ్ర జ్యోతి, రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంస్థ డైరెక్టర్లు ఎన్. బలరామ్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్), ఎన్.వి.కె. శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి. వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం. సురేష్, భూపాలపల్లి ఏరియా జీఎంబళ్లారి శ్రీనివాస్, కార్పోరేట్ జీఎంలు రమేష్ బాబు, ఆనందరావు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.