కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి స్వామివారి పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయ అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన వారు దొంగలు చొరబడినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన ఆలయంలోని బంగారు నగలతో పాటు, కొన్ని విగ్రహాలను దొంగిలించినట్లు గుర్తించారు.
ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి మరీ ఆలయంలోని విలువైన బంగారు, వెండి వస్తువులను అపహరించారు. పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల ఆనవాళ్లను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అలాగే క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు. చోరీ జరగడంతో భక్తులతో పాటు ఎవరిని ఆలయంలోకి పోలీసులు రానివ్వడం లేదు. దొంగతనానికి పాల్పడిన వారు స్థానికులా..? లేక వేరే ప్రాంతం నుండి వచ్చారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపుతోంది. దేవుని గుడికి రక్షణ లేకపోవడంపై అటు భక్తులు, ఇటు సామాన్యులు అధికారులపై సీరియస్ అవుతున్నారు.