ఆ కుతంత్రాలను తిప్పికొడదాం
-ప్రజలు, కార్యకర్తలు సంయమనం కోల్పోవద్దు
-అభివృద్ధి, అందరి క్షేమమే మన లక్ష్యం
-ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్
Balka Suman: చెన్నూరు నియోజకవర్గం పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని ప్రగతి నిరోధకులు చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారని అలాంటి కుతంత్రాలను తిప్పి కొడదామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా BRS పార్టీని బద్నామ్ చేయాలనే కుతంత్రాలు జరుగుతున్నాయని ఆయన ప్రజలు కార్యకర్తలను హెచ్చరించారు. వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుడు విమర్శలు, ఆరోపణలతో కవ్వింపు చర్యలకు పాల్పడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుమన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చని, ఇతర పార్టీలు, నాయకులు రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దని కోరారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చెన్నూరు ముఖ చిత్రం సమూలంగా మారిపోయిందన్నారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని చెన్నూరు నియోజకవర్గం నేడు అన్ని రంగాల్లో అద్బుత ప్రగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం, అండదండలతో చెన్నూరు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అవన్నీ మన కళ్ళముందే కనిపిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుని మందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.
అంతిమంగా మన లక్ష్యం చెన్నూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మన కోరిక ప్రజలందరి సంక్షేమని విప్ బాల్క సుమన్ వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు సంయమనం కోల్పోవద్దని మరోసారి స్పష్టం చేశారు.