ప్రాణం పోతున్నా.. మరో నలుగురికి ప్రాణ దానం
మంచిర్యాలలో ఓ కుటుంబం ఔదార్యం
Organ donation: అవయవ దానం కొందరిని చిరస్మరణీయులను చేస్తూ .. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడటమే కాకుండా చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుంది… అలాంటి పనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం చేసింది. తన ప్రాణం కోల్పోతున్న ఓ వ్యక్తి.. మరో నలుగురికి తన అవయవ దానంతో కొత్త ప్రాణం పోశారు.
మంచిర్యాల జిల్లా పద్మనాభ కాలనీ, రాంనగర్ చెందిన ముల్కల్ల దుర్గయ్య విద్యుత్ శాఖలో లైన్ మెన్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల కిందట ఆయన ఆకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలో ఆయనకు బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు ప్రకటించారు.
అయితే మొదటి నుంచి ఒకవేళ తాను చనిపోయినా తన అవయవాలు దానం చేయాలని దుర్గయ్య కోరిక మేరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి అవయవ దానం చేసేలా ఏర్పాట్లు చేశారు. దీంతో అతని కిడ్నిలు, ఊపిరితిత్తులు, కార్నియాలను జీవన్‌ధాన్ సంస్థకు దానం చేశారు. అవయవదానం చేసిన ఆ కుటుంబాన్ని అందరూ కొనియాడుతున్నారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. మరో నలుగురికి ప్రాణదానం చేయాలనే సదుద్దేశంతో దుర్గయ్య కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ సంస్థ (Jeevandan Organization)కు దుర్గయ్య అవయవాలను (Organs) అప్పగించారు. బాధలో ఉన్నా.. గొప్ప మనసుతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానం కార్యక్రమానికి ముందుకు వచ్చారని.. అతని నుంచి సేకరించిన అవయవాలతో మరో నలుగురికి పునర్జన్మ కల్పించే అవకాశం ఉందని జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.