సామాన్యుడి నడ్డి విరవడమే కేంద్రం లక్ష్యం
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
Manchiryal: కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దుయ్యబట్టారు. లక్షటిపేట ఉత్కూర్ చౌరస్తాలో పెంచిన సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసిందన్నారు. 2014లో బిజెపి అధికారం లోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద 350 సబ్సిడీ ఉంటే దానిని ఇప్పుడు మొత్తానికే ఎత్తివేశారని దుయ్యబట్టారు. దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారన్నారు.
ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి ప్రయాణాన్ని భారంగా మార్చిన మోదీ ప్రభుత్వం. మరోవైపు వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ జేబులు గుల్ల అయ్యే దుస్థితిని తీసుకొచ్చిందని దివాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.410.50 ఉంటే.. తాజా పెంపుతో ఏకంగా రూ.1,155కు చేరిందని, అంటే దాదాపు 178 శాతం పెంచిన ఘనత మోదీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే అచ్చే దిన్ కాదని సచ్చేదిన్ అని నడిపెల్లి దివాకర్ రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య,వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్, DCMS చైర్మన్ తిప్పని లింగన్న, పార్టీ ప్రెసిడెంట్ పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు…