తూతూ మంత్రంగా మహిళాదినోత్సవ వేడుకలు
ఎవరికి సమాచారం లేకుండా మొక్కుబడిగా కార్యక్రమం
Singareni : ప్రతి ఏటా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే సింగరేణి యాజమాన్యం ఈసారి మాత్రం మొక్కుడిగా ముగిస్తోంది. అధికారులు ఆ విషయంలో శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్న ధోరణిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
బెల్లంపల్లి ఏరియా మాదారం టౌన్షిప్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు అలాగే జరిగాయి. శనివారం సాయంత్రం నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఎవరికీ సమాచారం లేకుండా పోయింది. అధికారులకు తెలిసిన కొందరికి తప్ప మిగతా ఎవరికి సమాచారం అందించలేదు. దీంతో ఆ కార్యక్రమానికి 20 మంది మహిళలు మినహా ఎవరూ హాజరు కాలేదు.
వచ్చిన వారికి సైతం మూడు ఆటల్లో పోటీలు పెట్టి మమ అనిపించారు. కొందరు మహిళలకు మాత్రమే చెప్పడం, మాదారం టౌన్షిప్లో ఎవరిని ఆహ్వానించకపోవడం పట్ల పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల్లో స్ఫూర్తి నింపి వారిని ప్రోత్సహించాల్సిన అధికారులు కొందరికే చెప్పడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమాలు నిర్వహించే కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో శుభ్రం కూడా చేయించలేదు. లైటింగ్ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో వచ్చిన మహిళలు ఇబ్బందులు పడ్డారు.
ఇక ప్రతి ఏటా మాదారం టౌన్షిప్లో నిర్వహించే కార్యక్రమాలకు బెల్లంపల్లి జీఎం కార్యాలయం నుంచి సీనియర్ పీవో, పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చే వారు. కానీ ఈసారి నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలకు కేవలం ఒక పీఈటీ, జనరల్ మజ్దూర్ ను పంపి అధికారులు చేతులు దులుపుకోవడం కొసమెరుపు.