విచారణకు రాలేను… కవిత
రావాల్సిందే.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో గురువారం ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 10 గంటలకు కవిత మీడియా ముందుకు రానుందంటూ న్యూస్ బయటకు వచ్చింది. ఆ తరువాత అది కాస్తా.. 10:30కు మారింది. కానీ అది కూడా లేదు. ఆమె కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చిందే లేదు. 11 గంటలకు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉన్నా బయటకు రాలేదు.
కేసీఆర్ నివాసంలో కవిత.. మంత్రులు కేటీఆర్, హరీష్రావు తదితరులతో పాటు న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఈడీ విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని లేఖలో ఈడీకి వెల్లడించారు. 11:30 సమయంలో ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్తో ఈడీ అడిగిన సమాచారాన్ని పంపించారు. తన అనారోగ్య కారణాలతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నందున రాలేనని స్పష్టం చేశారు. అయితే ఈడీ కవిత విజ్ఞప్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తిరస్కరించింది. విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
దీంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది…? కవిత విచారణకు హాజరు అవుతారా..? లేదా..? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది..? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.