రాహుల్ ఆరోజు అలా చేసుండకపోతే..
-1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ చించేసిన రాహుల్‌గాంధీ
-అదే ఇప్పుడు శాపమై మెడకు చుట్టుకున్న వైనం
-పదేండ్ల తర్వాత దానికే బలైన కాంగ్రెస్ లీడర్
Rahul Gandhi: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు విషయంలో ఆయన స్వయంకృతాపరాధమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ అపరిపక్వతతో తీసుకున్న ఓ నిర్ణయం ఈ రోజు ఆయన మెడకే చుట్టుకుందని చెబుతున్నారు. ఇంతకీ రాహుల్ ఏం చేశారు..? ఏం జరిగింది..? ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి…?
1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఒక నేతకు శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. అయితే సెక్షన్ 8(4) సవరణకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్సులో కోర్టు శిక్ష పడ్డ నేతలకు అనర్హత వేటు నుంచి ఊరట లభిస్తుంది. జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధిని వెంటనే, తక్షణమే అనర్హుడిగా ప్రకటించకూడదని, అప్పీల్ కు సమయం ఇవ్వాలని పేర్కొంది. అంటే, దాదాపు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4) పునరుద్ధరిస్తూ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది.
అయితే రాహుల్ గాంధీ ఒక సమావేశంలో ఆవేశంగా ఓ ఆర్డినెన్స్ కాపీని చించేశారు. రాహుల్ సొంత పార్టీకి చెందిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అవమానించే ఉద్దేశ్యంతో అది ఆర్థం లేని ఆర్డినెన్స్ అంటూ మండిపడుతూ ప్రెస్ మీట్లోనే చించేశాడు.. దీంతో అది అక్కడే ఆగిపోయింది. సరిగ్గా పదేళ్లకు అదే చట్టానికి రాహుల్ ఇప్పుడు బలయ్యారు. ఆ చట్టం ప్రకారం ఆయన మీద అనర్హత వేటు విధిస్తున్నట్లు లోక్‌సభ సెక్రెటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం- రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులు అవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
పాపం.. రాహుల్‌గాంధీ ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఆయన మెడకే ఇలా చుట్టుకుందన్న మాట. రాజకీయాల్లో ఆవేశం అసలే పనికిరాదనే విషయం ఈ ఉదంతంతో మరోమారు స్సష్టమైంది. సోషల్‌మీడియాలో ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అధికారం ఉన్న సమయంలో రాహుల్‌గాంధీ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఆయన మెడకే చుట్టుకుందని పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.