ప్రభుత్వాన్ని కూలిస్తేనే సమస్యల పరిష్కారం
-సింగరేణి ప్రైవేటీకరణ కుట్రకు జరుగుతోంది
-భూ పంపిణీ చేయకుండా కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నడు
-రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు
-తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకే ఖర్చు చేస్తాం
-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka : మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయడం లేదని ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తేనే సమస్యల పరిష్కారం జరుగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయన పాదయాత్ర సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూరు ఐబీలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అసలు లక్ష్యాలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రజలు అంటున్నారని భట్టి స్పష్టం చేశారు.
తాండూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 198 ఇండ్లు పంపిణీ చేస్తే ఇప్పటివరకు ఆ కాలనీలో కనీస మౌలికవసతులు కల్పించి అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. తాండూరు మండలంలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ మూడుఎకరాల భూ పంపిణీ చేయకుండా దళితులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో ఇంటికో కొలువు ఇస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు.
నాలుగున్నర కోట్ల ప్రజలకు చెందాల్సిన తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబంలో ఉన్న నలుగురు పంచుకొని తింటుంటే చూస్తూ ఊరుకుందామా? భట్టి ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన 18లక్షల కోట్లు, ప్రజలందరిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి తెచ్చిన ఐదు లక్షల కోట్లు ఏం చేశారని అడిగారు. ఇల్లు కట్టారా? ఉద్యోగాలు ఇచ్చారా? నీళ్లు ఇచ్చారా? ఏమి చేయకుండా డబ్బులను ఏం చేశారని దుయ్యబట్టారు.
ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చి సాగుచేసి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కోల్ మైనింగ్ వనరులను ఆంధ్ర బడా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. మన కొలువులు మనకే, మన వనరులు, సంపద మనకే అని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 1.15 లక్షల మంది పనిచేస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసి 60వేల ఉద్యోగాలు తొలగించే కుట్ర జరుగుతున్నదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన కొలువులు మనమే చేసుకుంటామని భట్టి వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు సహాయం చేస్తామన్నారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, తెలంగాణ సంపద నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాత్రమే ఖర్చు పెడతామని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
పాదయాత్రలో ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.