నూతన సచివాలయం ధగధగలు…
Telangana Secretariat: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సచివాలయం పనులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సుమారు 2500 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం మొత్తం తిరిగి ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సచివాలయం నిర్మాణం దాదాపు చివరి దశకు చేరింది. భవనం బయటి వైపు చేయాల్సిన అన్ని పనులూ జోరుగా సాగుతున్నాయి. ప్రధాన ద్వారం ఇప్పటికే పూర్తవగా.. దానిపై అంబేడ్కర్ నూతన సచివాలయం అని రాశారు. దీంతో పాటు ఉత్తర, దక్షిణం ద్వారాలూ పూర్తవగా వాటిపైనా పేరు రాశారు. ప్రహరీ గోడకు పటిష్ఠమైన ఇనుప రెయిలింగ్ బిగించి రంగురంగు దీపాలను అమర్చారు. రెయిలింగ్‌తో పాటు ప్రధాన ద్వారానికి పెద్ద గేట్లను బిగించారు. అక్కడి నుంచి సచివాలయ భవనం వరకు వెళ్లే మార్గంలో పచ్చిక (గ్రీన్ లాన్) ఏర్పాటు పనులు సాగుతున్నాయి. లోపలి వైపు పనులు సైతం పూర్తి కానున్నాయి.
మరోవైపు యాగ్జిలరీ బిల్డింగ్ పనులు నడుస్తుండగా, గుడి, మసీదు నిర్మాణం కొనసాగుతోంది. సచివాలయ భవనం సుందరీకరణ ముమ్మరంగా జరుగుతోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు భవనం కింది భాగంలో పెద్ద ట్యాంక్‌ను ఏర్పాటు చేయగా, విద్యుత్ ఆదా కోసం సోలార్ పవర్‌ను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. సచివాలయ భవనం పూర్తయిన తర్వాత దానిపై సౌర పలకలను అమర్చేందుకు సైతం నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ కు నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలు ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే ఉత్తర, పడమర గేట్లను తెరుస్తారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారులు ఈశాన్య ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తారు.
ఆగ్నేయ ద్వారం సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్, ముఖ్య ఆహ్వానితులు, విదేశీ అతిథులకు మాత్రమే తూర్పు ద్వారం (మెయిన్ గేట్)ను ఉపయోగిస్తారు. వికలాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రికల్ వాహనాలు ఏర్పాటు చేయనున్నారు. సచివాలయంలోకి ప్రభుత్వ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రయివేటు వాహనాలకు అనుమతి ఉండదు.