గట్టిగా మాట్లాడితే దేశద్రోహులా?
కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం - శుక్రవారం రాష్ట్రమంతటా నిరసనలు
హైదరాబాద్ : తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. వరుసగా రెండోరోజూ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘‘మేము మద్దతిచ్చినప్పుడు దేశ ద్రోహులం కాదా? ఎవరు గట్టిగా మాట్లాడితే వారు ద్రోహులా? కేంద్రాన్ని నిలదీస్తే దేశ ద్రోహి అంటున్నారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటాదా? లేదా? సూటిగా చెప్పాలి’’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ప్రెస్మీట్లో మాట్లాడుతూ వడ్ల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. దిల్లీలో రైతు ఉద్యమంలో 600 మంది రైతులు మరణించారు. దీనిపై కేంద్రం మసిపూసి మారేడు కాయ చేద్దామని చూస్తోంది. ఏదైనా ప్రశ్నిస్తే దేశద్రోహి అని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు, బిల్లులకు మద్దతిచ్చినప్పుడు దేశద్రోహి కాని కేసీఆర్.. ఇప్పుడు దేశద్రోహి అయ్యాడు. ఎవరు మాట్లాడితే వారు దేశద్రోహులా..?. అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ నియమించిన గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆ పార్టీకి చెందిన వరుణ్ గాంధీ కూడా రైతు చట్టాల గురించి ప్రశ్నించారు. వారంతా దేశద్రోహులా..?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
ప్రభుత్వలను కూల్చిన పార్టీ బీజేపీ
ప్రశ్నించేవారిపై ఐటీ, ఈడీ దాడులు చేయించడం భాజపా నైజమని దుయ్యబట్టారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాల్లో ఒక్కటైనా ఉందా?అని ప్రశ్నించారు. ‘‘ భాజపా అనేక దొంగ లెక్కలు చేసింది. కర్ణాటకలో దొడ్డిదారిన ప్రభుత్వంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో మీరు గెలవలేదు. దొడ్డిదారిన మీ సర్కారు నడుస్తోంది. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చిన పార్టీ భాజపా. రాష్ట్రంలో 107 స్థానాల్లో భాజపాకు డిపాజిట్లు రాలేదు’’ అని విమర్శించారు.
ఒక్కటే నిమిషంలో రాజీనామా చేస్తా
తెలంగాణ బిల్లు పాసైనప్పుడు కేసీఆర్ ఓటేయలేదు అని బండి సంజయ్ అంటున్నాడు. ఆయన మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ. నువ్వు ఎవ్వనికి తెలుసు ఈ రాష్ట్రంలో. నీ పత్తానే లేదు. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే నడవదు. కథ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వదిలిపెట్టను. గొర్రెల పైసల్లో పైసా కేంద్రానిది ఉందని తేలితే నేను ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తాను. నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద గొర్రెల పథకానికి పైసలు అప్పుగా తీసుకున్నాం. వడ్డీతో సహా కడుతున్నాం. నీవు ఇచ్చింది ఏం తోక. అబద్దాలు మాట్లాడటం సరికాదు.
త్వరలో 70వేల ఉద్యోగాలు
తెలంగాణలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ఇందుకోసం ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ కోసం జోనల్ చట్టం తీసుకొచ్చామన్నారు. జోనల్ విధానం అమలు కారణంగా ఖాళీల భర్తీ కాస్త ఆలస్యం అవుతోందని చెప్పారు. ‘‘ మేం చేయగలిగిందే చెబుతాం. కేంద్రం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టింది. కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారన్న ప్రశ్న జోక్ ఆఫ్ ద మిలీనియం’’ అని చెప్పారు.
పదవులను చిత్తు కాగితాలగా విసిరి కొట్టాం
తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకుంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అప్పుడున్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల్లో లక్ష్మీనారాయణ రాజీనామా చేసిండు, కిషన్ రెడ్డి పారిపోయిండు. నిజామాబాద్ ఉప ఎన్నికకు వెళ్లి యెండల తరపున ప్రచారం చేశాం. ఆవేశంగా మాట్లాడుతున్నాను. జేఏసీ పిలుపునిచ్చిన కూడా కొందరు దద్దమ్మలు పారిపోయిండ్రు అని అన్నాను. ఒకరిద్దరు పిల్లలు మీ పక్కనే ఒక దద్దమ్మ ఉన్నడు అని చెప్పిండ్రు. అప్పుడు నా పక్కనే కిషన్ రెడ్డి ఉన్నడని చెప్పారు. మేం దద్దమ్మలం కాదు. పదవులను చిత్తుకాగితాల్లాగా విసిరికొట్టినం. ఎన్నో రాజీనామాలు చేశాం. అలా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
12న రైతు ధర్నాలు
కేంద్రంపై సీఎం కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనను అని చెబుతున్నావ్. ఇది నీ చేతకాని తనం కాదా? అని ప్రశించారు. కేంద్రం వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపడుతాం. లక్షలాది మంది రైతులతో కలిసి ధర్నాలు చేయబోతున్నాం. వడ్లు కొంటవా? కొనవా? అనేది తేలాలి. రైతులతో కలిసి పోరాడుతాం. శుక్రవారం మాతో కలిసి నువ్వు కూడా ధర్నాకు కూర్చుంటావా? తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనాల్సిందే. అని కేసీఆర్ అన్నారు.