1130 ఉద్యోగాలు… వారికే ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది కొత్తగా 1130 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. నియామకాల్లో నెట్, పీహెచ్‌డీ ఉన్న వారికే తొలి ప్రాధాన్యమివ్వనున్నారు. పీజీ అర్హత గల వాళ్లను తీసుకునే అవకాశం ఉంది. కానీ నెట్, పీహెచ్‌డీ అర్హత గలవారు దొరకని పక్షంలో మాత్రమే పీజీ పూర్తిచేసిన వారికి అవకాశం కల్పించనున్నారు. డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తికాగా ఇటీవలే క్లాసులు ప్రారంభమయ్యాయి. పలు డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల కొరత సమస్య ఉంది. ఈ నేపథ్యంలో కాలేజీలన్నింటి నుంచి వివరాలను తెప్పించిన అధికారులు 1130 గెస్ట్ లెక్చరర్లు అవసరమని తేల్చారు. వీటికి అనుమతి కోరుతూ పై అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని అధికారులు తెలిపారు.