చనిపోయిన బాలుడితో కేక్ కట్ చేయించారు
Kumurabhim Asifabad District: తెల్లవారితే పుట్టిన రోజు… కానీ, విధి వెక్కిరించింది. పదహారేళ్లు కూడా నిండని బాలున్ని ఓ వ్యాధి రూపంలో బలిగొంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చనిపోయిన తన కొడుకు శవంతోనే కేక్ కటింగ్ చేయించి అంత్యక్రియలు నిర్వహించారు ఆ కుటుంబ సభ్యులు…
కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ చెందిన చూనార్కర్ గుణవంతరావు, లలిత మూడో కుమారుడు సచిన్ (16) ఆ బాలుడు ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసుకున్నాడు. ఇటీవలి ఫలితాల్లో 7.7 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సమయంలోనే బాలునికి కడుపు నొప్పి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి తండ్రికి ఫోన్ చేసి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఈసీజీ తీసిన వైద్యుడు సమస్య ఉందని చెప్పడంతో వెంటనే తండ్రి సచిన్ కుమారున్ని మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ బాలుడు సాయంత్రం మృతి చెందాడు. దీంతో కన్నవారి రోదనలు మిన్నంటాయి.
శుక్రవారం సచిన్ పుట్టిన రోజు కావడంతో తెల్లవారితే జన్మదిన వేడుకలను జరపాలని తల్లిదండ్రులు ఉత్సాహంతో ఉన్నారు. కానీ చనిపోవడంతో కేక్ తెప్పించి అర్ధరాత్రి కేక్ కట్ చేయించారు. పుట్టిన రోజునే మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.