సింగరేణికి కేంద్రం బంపర్ ఆఫర్
సింగరేణికి కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాడిచర్ల ఓసీ-2 (బ్లాక్-2) బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సింగరేణికి కేటాయించింది. ఎలాంటి ఓపెన్ వేలం లేకుండా నేరుగా సింగరేణికి అప్పగిస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ బ్లాక్‌లో దాదాపు 182 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉండగా, దాదాపు 40 నుంచి 50 ఏళ్ల పాటు ఈ గని ద్వారా ఉత్పత్తి కొనసాగుతుంది. వేలం ప్రీమియం భారం తప్పడం వల్ల సింగరేణి సంస్థకు రూ. 2,550 కోట్లు మిగులుతాయి. రాయల్టీలు, ఇతర పన్నుల రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి రూ. 16,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా సుమారు 1,200 మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, జీవనాడి అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్రగతికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 12 ఏళ్లుగా సింగరేణి అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని వెల్లడించారు. దేశాభివృద్ధిలో సహకార సమాఖ్య విధానంతో అన్ని రాష్ట్రాలూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి పరిధిలోని ప్రధాన మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ, అటవీ శాఖ అనుమతులను కేంద్రం అత్యంత వేగవంతం చేస్తోందని గుర్తుచేశారు.
ఒడిశాలోని ‘నైనీ’ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కేలా కేంద్రం ప్రత్యేక కృషి చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇవి 30 నుండి 35 ఏళ్ల అవసరాలకు సరిపోతాయన్నారు. ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం రావడం ద్వారా సింగరేణికి ఏకంగా రూ.75,000 కోట్ల రెవెన్యూ వచ్చే మార్గం సుగమమైందన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగే బొగ్గు గనుల వేలంలోనూ పాల్గొనేందుకు సింగరేణి ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు.కార్మికుల సంక్షేమం, సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాడిచర్ల-2ను సింగరేణికే కేటాయించడం పట్ల INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి సైతం హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా చొరవ చూపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి కార్మికుల పక్షాన, ఐఎన్‌టీయూసీ (INTUC) తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.