ఇందిర‌మ్మ ఇండ్లలో దీపావ‌ళి సంబురాలు

ఇందిర‌మ్మ ఇండ్ల(Indiramma Houses) వ‌ద్దే దీపావ‌ళి సంబురాలు చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పిలుపునిచ్చారు. “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” పేరుతో ప్ర‌భుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో 2,21,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా, లబ్ధిదారుల సొంతింటి సంతోషంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నారు. త‌న‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు.. మీరు సైతం ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా క్షేత్రస్థాయిలో పేదల ఆదరాభిమానాలను సంపాదించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో శాశ్వత విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఆర్థిక పరమైన ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతున్నా ఈ పథకాన్ని ఆపకుండా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇళ్లలో ఇప్పటికే 2,21,500 ఇళ్ల నిర్మాణాలు పూర్త‌య్యింది. చాలా చోట్ల లబ్ధిదారులు గృహప్రవేశాలు సైతం చేశారు. మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉండగా, మిగిలిన గృహాలను కూడా వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే దీపావళికి రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరిట నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy), దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) తదితరులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దీపాలు వెలిగించాలని సూచించారు. “ఇందిరమ్మ ఇళ్లు చూపించిన తర్వాతే ఓట్లు అడుగుతాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలకు అనుగుణంగానే ఈ వేడుకలను రాజకీయ ప్రచార అస్త్రంగా, అదే సమయంలో ప్రజా సంక్షేమ విజయోత్సవంగా కాంగ్రెస్ పార్టీ మలచుకుంటోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేయడం ద్వారా అవినీతికి తావులేకుండా పారదర్శకతను ప్రదర్శిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

You might also like