రిమ్స్ చోరీ కేసులో కీలక పురోగతి

-చోరీకి పాల్పడింది మహారాష్ట్ర ముఠాగా గుర్తింపు
-ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలీసులు
-దొంగల కోసం రంగంలోకి దిగిన 4 ప్రత్యేక పోలీసు బృందాలు
-సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారుల సీరియస్.. 12 మందికి మెమోలు జారీ

ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో కలకలం రేపిన వెంటిలేటర్ల చోరీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. పట్టపగలే దొంగలు ఆసుపత్రిలోకి చొరబడి అత్యవసర వైద్య పరికరాలను ఎత్తుకెళ్లిన ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. చోరీకి పాల్పడింది మహారాష్ట్రకు చెందిన దొంగలుగా గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా దొంగల కోసం వేట కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆసుపత్రి ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు.

గత నెల 30న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఆర్.ఐ.సి.యూ (RICU), టీబీ (TB) వార్డుల్లోకి ప్రవేశించిన దొంగలు ఏకంగా 4 వెంటిలేటర్లను ఎత్తుకెళ్లారు. పట్టపగలే ఈ చోరీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో దొంగలను మహారాష్ట్రకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు చెందిన వసంత్ మోటే అనే నిందితుడిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మరోవైపు ఆసుపత్రిలో భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అత్యవసర ప్రాణదాతలైన వెంటిలేటర్లు చోరీకి గురైనా గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చోరీ జరిగిన రోజున విధుల్లో ఉన్న 12 మంది వైద్య, భద్రతా సిబ్బందికి రిమ్స్ డైరెక్టర్ మెమోలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.

You might also like