పోలీసుల అదుపులో ఆ నలుగురు
Murder:మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మహిళ కేసులో పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన స్వప్న శ్రీ అనే మహిళను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్వప్న శ్రీ రెండో భర్త వేల్పుల మధుతో పాటు ఆయన తండ్రి, తమ్ముడు హత్య చేసిన వెంటనే కోటపల్లి పోలీసులకు లొంగిపోయారు. ఇదే ఘటనలో వారి దగ్గరి బంధువు అయిన మరో మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళే స్వప్నశ్రీకి ఫోన్ చేసి రమ్మని పిలిచినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మహిళను సైతం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ హత్యలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా..? వేరే కారణాలు సైతం ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నారు.
స్వప్నశ్రీ మొదటి భర్త చనిపోవడంతో వేల్పుల మధు అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. కోటపల్లి మండలం వెంచపల్లిలో దళితబస్తీ కింద స్వప్నపేరుతో మూడెకరాల భూమి వచ్చింది. రెండో భర్తతో మనస్పర్ధలు వచ్చి స్వప్న వేరే వ్యక్తితో మంచిర్యాలలో ఉంటోంది. తన పైరవీ వల్లనే భూమి వచ్చిందని తన భూమి తనకు కావాలంటూ స్వప్నపై రెండో భర్త మధు ఒత్తిడి తెచ్చాడు. అయినా దానిపై స్వప్న స్పందించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ఈ హత్యకు పాల్పడ్డాడు.