ఎగిరే శవ పేటికలకు కాలం చెల్లింది
-MiG-21 సేవలు తాత్కాలికంగ నిలిపివేసిన ఎయిర్‌ఫోర్స్
-ఆరు దశాబ్దాల్లో 400 ప్రమాదాలు
-ఇక వాటికి శాశ్వత వీడ్కోలు సూత్రప్రాయమే

MiG-21: మిగ్-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 50 మిగ్ యుద్ధ విమానాలను పక్కకు పెట్టింది. ఈ విమానాలు తరచూ ప్రమాదానికి గురి కావడం, పెద్దఎత్తున మరణాలు సంభవిస్తుండటంతో వీటిని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈనెల 8న రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో ఓ మిగ్-21 విమానం కూలిపోయి ముగ్గురు చనిపోయారు. ఈ నేపథ్యంలో అన్ని మిగ్ యుద్ధ విమానాలను ఐఏఎఫ్ టెక్నికల్ తనిఖీల కోసం పంపించారు. ప్రస్తుతం ఆ విమానాలన్నింటికీ సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. విధుల నిర్వహణకు ఫిట్ అని తేలిన తర్వాత సంబంధిత నిపుణుల టీం క్లియరెన్స్ ఇచ్చాకే వాటిని అనుమతిస్తామని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కాగా, 1960లో మిగ్ యుద్ధవిమానాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశపెట్టారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాదాపు 870 మిగ్-21 ఫైటర్లను తయారు చేసింది. అయితే, ఈ విమానాల పనితీరు నాసిరకంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.
రష్యా తయారు చేసిన MiG-21 వైమానిక దళంలో అత్యంత పురాతనమైన యుద్ధ విమానాలు. ఐదు దశాబ్దాలుగా భారత వైమానికదళంలో ఈ యుద్దవిమానాలు భాగమయ్యాయి. సాంకేతిక లోపాలతో జరిగిన ప్రమాదాలు వరుసగా మారడంతో దీనికి ‘ఎగిరే శవపేటిక’ అని పేరు పెట్టారు. అధికారిక సమాచారం ప్రకారం, గత ఆరు దశాబ్దాల్లో MiG-21 విమానాలు 400 క్రాష్‌లకు గురయ్యాయి. ప్రస్తుతం సేవలందిస్తున్న 70 MiG-21 విమానాలను రెండేళ్లలో దశలవారీగా తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటనపై విచారణ జరుగుతోంది. ఈలోగా మిగ్ విమానాల సేవలన్నీ నిలిపివేయాలని నిర్ణయించారు.