తండ్రి చనిపోయాడు.. తల్లి వంట మనిషి..
గురుకులంలో చదివి సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలంగాణ దళిత బిడ్డ
Civils Results: తండ్రి గతంలోనే మరణించాడు.. తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తుంది… అయినా కష్టపడి చదివాడు. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిశాడు.
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల పరిధిలోని తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి రేవయ్య యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 410వ ర్యాంక్ సాధించాడు. తుంగెడ గ్రామానికి చెందిన మనోహర్, విస్తారి భాయ్ దంపతుల కుమారుడు రేవయ్య. కాగజ్ నగర్‌లోని శిశుమందిర్ లో ఒకటి నుండి 5వ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో, హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.
అనంతరం మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాడు. ఉద్యోగం చేయడం వల్ల సరిగా చదవలేకపోతున్నానని చెప్పి.. ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్‌పై దృష్టి కేంద్రీకరించాడు. రేవయ్య మొత్తంగా సివిల్స్ తుది ఫలితాల్లో 410వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.