నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’
-జైపూర్ ఏసీపీ నరేందర్
-నిరుపేద కుటుంబాలకు బియ్యం, చీరలు
-యువత కు వాలీ బాల్ కిట్స్ పంపిణీ
Ramagundam Police Commissionerate: పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని, ప్రజలకు పోలీసులు భద్రత, భరోసా కల్పించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని జైపూర్ ఏసీపీ నరేందర్ అన్నారు. కోటపల్లి మండలం అన్నారంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ నరేందర్ మాట్లాడారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చాలామంది యువకులు ఆన్లైన్ మోసాలకు బలవుతున్నారని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, గ్రామాభివృద్ధికి పాటు పడాలని కోరారు.
గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా 100కు ఫోన్ చేయాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు సరైన ధ్రువపత్రాలతో పాటు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వ్యాపార సముదాయాలు, చౌరస్తాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేనటువంటి 70 బైకులు, 12 ఆటోలు, 03 టాటా ఏస్ ఆటోలు, 02 బొలెరో వాహనాలు సీజ్ చేశారు. కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ సీఐ విద్యా సాగర్, కోటపల్లి ఎస్ఐ వెంకట్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.