ప్రమాదం అంచున తాత్కాలిక వంతెన
-పొంచి ఉన్న ప్రమాదం
-రాకపోలకు అంతరాయం
Andavelli Bridge: భారీ వర్షాలతో వంతెన కూలిపోయింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన సైతం కోతకు గురైంది. దీంతో రాకపోకలకు అంతరాయం సంభవించడమే కాకుండా, ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొమురం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందవెల్లి దగ్గర బ్రిడ్జి కూలిన విషయం తెలిసిందే. పెద్దవాగు ఉధృతికి కుంగుతూ వచ్చిన వంతెన ఆ తర్వాత మెల్లగా కుప్పకూలింది. అప్పటికే ఆ వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. వంతెన కూలిపోవడంతో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జికి మొత్తం 10 పిల్లర్లు, 11 స్లాబులు ఉన్నాయి. కూలిన బ్రిడ్జిని ఎమ్మెల్యే కోనప్ప పరిశీలించి, బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశారు.
దీంతో అందపెల్లి బ్రిడ్జి రిపేర్లకు 2 కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మరమ్మతులకు టెండర్లు పిలవగా ఏపీకి చెందిన ఒకే కంపెనీ పాల్గొంది. ఈ టెండర్లను వల్లభనేని కన్స్ట్రన్స్ ప్రయివేటు లిమిటెడ్ దక్కించుకుంది. వర్షాకాలంలో వాగు ఉధృతి అధికంగా ఉండడాన్ని దృష్టిలో పెట్టకొని ఆర్ అండ్‌బీ శాఖ అధికారులు మళ్లీ నివేదికలు తయారు చేశారు. ఆరు పిల్లర్లు, ఐదు స్లాబ్‌లు, ఇతర పనులకు మొత్తం రూ. 13 కోట్ల మేర ఖర్చు అవుతాయని ప్రతిపాదించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.
అప్పటి వరకు రాకపోకల కోసం వాగుకు అడ్డంగా కంకర, హ్యూమ్ పైపులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా తరచూ వానలు పడుతుండటంతో వాగు ఉధృతి పెరగడంతో తాత్కాలిక వంతెన కోతకు గురైంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ తాత్కాలిక వంతెన వద్ద ప్రమాదం పొంచి ఉందని ప్రజలు చెబుతున్నారు.