ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు 51 అడుగులు
Khairatabad Ganesh: భక్తులను అనుగ్రహించేందకు బొజ్జ గణపయ్య సిద్దమవుతున్నాడు. వినాయక చవితి సమీపిస్తున్న వేళ ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి బుధవారం అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటు కోసం కర్రపూజ సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. ఈ పూజతో గణనాథుడి విగ్రహ నిర్మాణ పని ప్రారంభమైంది. ఈ ఏడాది 51 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఆలాగే వచ్చేవారం వినాయకుడికి సంబంధించిన పోస్టర్ విడుదల చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారు చేయనున్నారు. గతేడాది కూడా మట్టితో తయారు చేసిన 50 అడుగుల ఎత్తైన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. ఈ ఏడాది మరో అడుగు ఎత్తు పెంచి 51 అడుగుల విగ్రహం చేయనున్నారు. గత ఏడాది సుప్రీం కోర్టు ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 68 ఏళ్లలో తొలిసారిగా పూర్తిగా మట్టితో తయారుచేశారు. విగ్రహ తయారీకి విగ్రహ తయారీకి 35 టన్నుల మట్టి వినియోగించారు. ఈసారి కూడా అదే స్థాయిలో విగ్రహాన్ని రూపొందిస్తామని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వెల్లడించింది.