పోరాటం హైజాక్…
-ఆదిలాబాద్ బీజేపీలో గ్రూప్ వార్
-ఒకరు చేస్తున్న పోరాటంలోకి మరొకరు ఎంటర్
-ఇద్దరు నేతల మధ్య రచ్చకెక్కిన విబేధాలు
BJP: బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తెరపైకి వచ్చాయి.. ఆఖరికి నేతలు పోరాటం సైతం హైజాక్ చేస్తున్నారు. ఒకరి చేసే పోరాటం మరొకరు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అది బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు నేతల మధ్య మొన్నటి వరకు సాగిన సైలెంట్ వార్ తెరపైకి వచ్చింది. కమలం పార్టీలో కస్సుబుస్సులకు కారణం ఏంటి..? ఎవరి పోరాటాన్ని ఎవరు హైజాక్ చేస్తున్నారు..? అధికార పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్నపై పోరాటం చేసేదెవరు..? రామన్నకు అనుకూలంగా ఉద్యమాలు చేస్తున్నది ఎవరు..? అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది.
ఆదిలాబాద్ లో బీజేపీ రాష్ట్ర నాయకురాలు, మాజీ జడ్పీ చైర్పర్సన్ చిట్యాల సుహాసినీరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మధ్య టిక్కెట్టు కోసం పోటీ నెలకొంది. వారి మధ్య ఎన్నో ఏండ్లుగా వర్గపోరు కొనసాగుతోంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి రాకతో ముక్కొణ పోటీ కొనసాగింది. శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు నేతలు, కార్యకర్తలు తన్నులాట వరకు వెళ్లింది. ఇప్పుడు కాస్తా తిరిగి ఇద్దరి మధ్య నడుస్తోంది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో పోటీ హీట్ పీక్ స్టేజీకి చేరుకుంది.
ఇటీవల అక్కడ ఏ ఉద్యమం జరిగినా సుహాసినీ రెడ్డి, పాయల్ శంకర్ మధ్య తగవుగా మారింది. ఎక్కడ చూసినా తామే ముందుండాలనే ఉద్దేశంతో ఇద్దరు నాయకులు ముందుకు సాగుతున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జొన్నల కొనుగోలు పోరాటం, రైతు సమస్యలపై సైతం ఇద్దరు నాయకులు పోటాపోటీగా పోరాటం చేశారు. ఆ రెండు పోరాటాల్లో తామే ముందున్నామని చెప్పుకునేందుకు వీరిద్దరూ మీడియాతో పాటు సోషల్ మీడియాను సైతం వాడుకుంటున్నారు.
ఇక, రేణుకా సిమెంట్ పరిశ్రమ భూ నిర్వాసితుల పోరాటం ఇద్దరి మధ్య మరింతగా నిప్పు రాజేసింది. చాలా ఏండ్ల నుంచి రేణుకా సిమెంట్ పరిశ్రమకు ఇచ్చిన భూములకు సంబంధించి చిట్యాల సుహాసిని రెడ్డి పోరాటం చేస్తున్నారు. దానిపై ఆమె ఢిల్లీ వరకు వెళ్లారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్ నాయక్ ఆదిలాబాద్ వచ్చిన సమయంలో ఆయనను కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ పోరాటం ఆయన దృష్టికి సైతం తీసుకువెళ్లారు. ఈ పోరాటంలో తాను సైతం ముందుండాలనే ఉద్దేశంతో పాయల్ శంకర్ ప్రయత్నాలు చేశారు. సుహాసిని రెడ్డి ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి పత్రం ఇచ్చిన తెల్లవారి శంకర్ సైతం విజ్ఞాపన పత్రాలు అందించి వచ్చారు.
రేణుకా సిమెంట్ పరిశ్రమకు ఇచ్చిన భూములను దున్నుతామని ఐదు రోజుల కిందట సుహాసిని రెడ్డి పిలుపునిచ్చారు. అది కాస్తా ఉద్రికత్తకు దారి తీసింది. ఆమె ఎడ్లబండిపై వెళ్లి ఆ భూములతో నిర్వాసితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నిర్వాసితులు సైతం పోలీసులను అడ్డుకోవడం, మందు డబ్బాలతో మహిళలు పోలీసు వాహనాలపై ఎక్కి ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు సుహాసిని రెడ్డిని అరెస్టు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అటు వైపు వెల్లవద్దని కండీషన్‌తో ఆమెకు బెయిల్ మంజూరు చేశారు.
ఇక సుహాసిని రెడ్డి ఆ భూమల వైపు వెళ్లరని భావించిన పాయల్ శంకర్ తాము రేణుకా సిమెంట్ భూములను ట్రాక్టర్లతో దున్నుతానని పిలుపునిచ్చారు. తమ ఇంటి వద్ద నుంచి ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్లి అక్కడ భూములు దున్నుతామని హెచ్చరించారు. దీంతో చిట్యాల సుహాసిని రెడ్డి ఆ పోరాటానికి రైతులకు సంబంధం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అక్కడ రైతులు సైతం తమతో వచ్చేందుకు సుముఖంగా లేరని గ్రహించిన పాయల్ శంకర్ ఇంటి వద్దే ట్రాక్టర్ ఎక్కి కాసేపు హల్చల్ చేశారు. పోలీసులు అడ్డుకోవడం, మీడియా కవరేజ్ కావడంతో ఆయన ఇంట్లోకి వెళ్లిపోయారు.
అనంతరం సుహాసిని రెడ్డి విలేకరుల సమావేశంలో సొంత పార్టీ నేతలపై వేసిన సెటైర్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాకుండా, కొత్త చర్చకు దారి తీశాయి. కొందరు నేతలు స్వార్థం కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్నపై పోరాటం చేసేదెవరు..? రామన్నకు అనుకూలంగా ఉద్యమాలు చేస్తున్నది ఎవరు..? గ్రహించాలని అన్నారు. పరోక్షంగా ఆమె పాయల్ శంకర్‌ను ఉద్దేశించే అన్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మీ పోరాటాన్ని సొంత పార్టీ నేతలే హైజాక్ చేస్తున్నారని మీరు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారా..? అని కొందరు విలేకరులు ప్రశ్నిస్తే అధిష్టానానికి అంతా తెలుసునని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటూ ఆమె స్పష్టం చేశారు.
ఇలా ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో పోరాటాల హైజాక్ వ్యవహారం కొనసాగుతోంది. మరి ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారు.. చివరకు ఎవరు గెలుస్తారు.. వీరిద్దరమి మధ్య పోరు కాస్తా ఎదుటి పార్టీల వారికి కలిసివస్తుందా…? అనేది సైతం అంతుపట్టని ప్రశ్నగా మారింది. బీజేపీ అధిష్టానం దీనిని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి…