అక్క.. ఇప్పుడు అందరితో కలిసి..

ZP Chairperson Nallala Bhagyalakshmi: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. తమ చుట్టూ ఉన్న వాళ్లు ఒక్కసారిగా మాయం కావచ్చు.. దూరం ఉన్న వారంతా మన చుట్టూ చేరివచ్చు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి.. గత ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అమరవీరులకు ఒంటరిగా నివాళులు అర్పించారు. మొదట టీఆర్ఎస్లో ఉన్న ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే ఓదెలు కాంగ్రెస్లో చేరారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో… ఆమె చుట్టూ జనం మాయం అయ్యారు. దీంతో గత ఏడాది అమరవీరుల స్థూపం దగ్గర జడ్పీ చైర్పర్సన్ ఒంటరిగా నివాళి అర్పించారు. కానీ పరిస్థితి మళ్లీ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. అధికార పార్టీ నేతలు, నాయకులు ఆమె చుట్టూ మందీ మార్భలం. శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో హంగూ, ఆర్భాటాల మధ్య అమరవీరులకు నివాళి అర్పించారు.