మత మార్పిళ్లు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకం
-పాస్టర్లపై వ్యాఖ్యలు రాద్ధాంతం చేయొద్దు
-ఆదివాసీ జాతి రక్షణ కోసం చావుకైనా సిద్దమే
-ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు

Soyam Bapu Rao:క్రైస్తవులంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని, అందరి కంటే తానే ఎక్కువగా అన్ని మతాలను గౌరవిస్తానని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు స్పష్టం చేశారు. నాలుగు రోజుల కిందట తాను చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయ పబ్బం కోసం వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జన సురక్ష మంచ్ సభలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని సోయం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో అమాయక ఆదివాసీలను కొందరు పాస్టర్లు ప్రలోభ పరుచుకొని బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్నారని అన్నారు. ఇంకో మతం వారు మా జాతి యువతులను మాయ మాటలతో లవ్ జిహాద్ ఉచ్చు లో దించుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సనాతన సంస్కృతి ఆదివాసీ ఆచారాలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. ఇలాంటి అనైతిక చర్యల వల్ల ఆదివాసీ జాతి మనుగడ ప్రశ్నర్ధకంగా మారడం నాకు బాధ కలిగించిందని ఎంపీ స్పష్టం చేశారు.
రాంజీ గోండ్, కొమురం భీం వారసులమైన మేం అంతరించిపోతున్న జాతి మనుగడ, అస్తిత్వం కోసం జాతిని కాపాడుకునేందుకు డెబ్భై ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నామని సోయం స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మతం మారిన ఆదివాసీలను ST జాబితా నుండి తొలగించి రిజర్వేషన్ లను రద్దు చేయాలనీ డిమాండ్ చేయడమే కాక తీర్మానం కూడా చేశామని తెలిపారు. ఆదివాసీల సంస్కృతి దెబ్బకొట్టి బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్న ఒక ముఠా గురించే నేను మనోవేదనతో ఘాటుగా మాట్లాడి ప్రతీకార చర్యలతో బుల్లెట్ల మాదిరిగా ప్రతిఘటిస్తాం అని చెప్పినట్లు సోయం బాపురావు వెల్లడించారు. దీనిని క్రైస్తవ సోదరులు, సంఘాలు అపార్థం చేసుకోవడం శోచనీయమన్నారు. బలవంతపు మత మార్పిడిలు చేస్తూ అమాయక గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్న కొందరు పాస్టర్ల తీరు గురించే తీవ్రంగా స్పందించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది తప్ప క్రైస్తవ మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కానే కాదని సోయం తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాలలో 5th షెడ్యూల్ ప్రకారం అన్యమత ప్రచారం రాజ్యాంగ విరుద్ధమని ఎంపీ వెల్లడించారు. అయినా ఇంతకాలం మేము ఓపిక సహనంతోనే ఉన్నామని, బలవంతపు మత మార్పిడిలు ఆపివేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామని సోయం బాపురావు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో 1200 మంది అమాయక ఆదివాసులను బలవంతంగా మతమార్పిడి చేయడం తమ దృష్టికి వచ్చిందన్నారు. జాతి కోసం ఉద్యమాలు చేస్తున్న తనపై కొందరు అనవసరంగా, అకారణంగా విమర్శలు, ఆరోపణాల్తో రాద్ధాంతం చేస్తున్నారని, అది మానుకోవాలని ఆయన హితవు పలికారు. తనను కొందరు బెదిరించి, హెచ్చరించడం అవివేకమన్నారు. నా జాతి కోసం చావుకైనా సిద్ధమేనని గుర్తుంచుకోవాలని మరోసారి విన్నవిస్తున్నానని సోయం బాపురావు స్పష్టం చేశారు. అన్ని మతాలు తన దృష్టిలో సమానమే . కొన్ని ముఠాల చర్యలను మాత్రమే నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు.