వైన్ పేరుతో కోట్ల రూపాయలు ముంచేశారు..
మేం వైన్ కంపెనీలో పెట్టుబడి పెడతాం.. మీరు ఒక వైన్‌బాటిల్ ఖరీదు చేయండి.. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తాం.. కొందరిని జాయిన్ చేస్తే మీకు నెలనెలా జీతం కూడా ఇస్తామని చేసిన ప్రకటన నమ్మిన కొందరు అమాయకులు అందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే వందల సంఖ్యలో బాధితులు ఉన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ది వైన్ గ్రూప్ (TWG) పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసిన వ్యక్తులు గ్రూపుల్లో లింక్‌లు పంపి వారిని ఆకర్షించారు. తమకు తెలిసిన వారిని, వారి ద్వారా మరికొందరిని ఇలా ఒక చైన్ సిస్టం సృష్టించారు. తాము ఒక వైన్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామని తమ గ్రూపులో చేరిన వారందరికీ చెప్పారు. ముందుగా ఒక వైన్‌బాటిల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వైన్ బాటిల్‌తో మనం కొన్న డబ్బులు పెట్టుబడిగా పెట్టి వాటి ద్వారా వచ్చే డబ్బు వినియోగదారులకే ఇస్తామని చెప్పారు. ఒక వైన్ బాటిల్ కొంటే 60 రోజుల్లో మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని నమ్మబలికారు. 85 వేలు పెట్టుబడి పెడితే ప్రతిరోజు రూ. 1,2310 చొప్పున ఇచ్చారు. అలా 30 రోజుల్లో ఆరు లక్షల వరకు ఇస్తామని చెప్పారు. మొదట్లో బాగానే ఇచ్చారు. కొద్ది రోజులుగా ఆ చెల్లింపులు నిలిపివేశారు.
ఒక ఆప్ క్రియేట్ చేసి దాని ద్వారా వ్యవస్థ మొత్తం నడిపించారు. దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్ కింద దాదాపు 1.3 మిలియన్ మంది ఉన్నారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో సైతం లక్షల్లో ప్రజలు ఈ నెట్‌వర్క్ కింద జాయిన్ అయ్యారు. ఈ ప్రాంతానికి చెందిన మేనేజర్ గోవాలో ఉంటానని వాట్సప్ గ్రూపులో చాటింగ్ చేస్తూ డబ్బులు సేకరిస్తోంది. వైన్ బాటిల్‌పై పెట్టుబడి పెట్టడమే కాకుండా, చైన్‌సిస్టంలో 230 మందిని చేర్పిస్తే నెల నెలా ఇరవై వేల వరకు జీతం వస్తుందని చెప్పారు. దీంతో చాలా మంది తమకు డబ్బులు వస్తాయనే ఆశతో ఇందులో చేరారు. ఆ వైన్ బాటిల్ కొంటే ప్రతి రోజు డబ్బులు ఇచ్చేవారు. కొందరైతే రోజు తీసుకోవడం ఎందకుని లక్షలు, వేలు అందులోనే ఉంచారు. ఉన్నవి పోయాయి, ఉంచుకున్నవీ పోయాయన్నట్లు ఇప్పుడు నిర్వాహకులు ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదు.
మే నెల 30 నుంచి వినియోగదారులకు డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో తమకు కొద్ది రోజుల నుంచి కస్టమర్లకు డబ్బులు రాకపోవడం నిర్వాహకులను మెసేజ్ ద్వారా సంప్రదించారు. తాము గోవాలో ఉన్నామని, డిల్లీలో ఉన్నామని వారు చెబుతూ ఇప్పటికీ కస్టమర్లను ఆకర్షిస్తునే ఉన్నారు. మీ డబ్బులు మీకు రావాలంటే సర్వర్ కొనండి, పేపాల్ కొనండి అంటూ మెసేజ్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు రూ. 4 వేల నుంచి రూ. 20వేల వరకు పెట్టుబడి పెడితే మిగతా డబ్బులు ఇస్తామని ఇప్పటికీ నమ్మబలుకుతున్నారు. దీంతో కొంతమంది ఆ మాటలు కూడా విని రూ. 8 వేలు పెట్టి సర్వర్ కూడా కొన్నారు. మూడు రోజులు గడుస్తున్నా ఇంత వరకు డబ్బులు రాలేదు. అదేమని అడిగితే మళ్లీ పేపాల్ యాప్ కొనండి.. రెండు గంటల్లో డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఇలా నిర్వాహకులు ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో చాలామంది ప్రజలు ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోయారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్ష్సెట్టిపేట, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న వారు తమకు తెలిసిన వారి ద్వారా ఈ గ్రూపులో జాయిన్ అయినట్లు సమాచారం. అప్పులు చేసి, బంగారం అమ్మి మరీ పెట్టుబడి పెట్టారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రెడ్డి కాలనీకి చెందిన ఒక మహిళ ఏకంగా రూ. 10 లక్షలు పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఆమె పెట్టుబడి పెట్టడమే కాకుండా, ఆమె కింద మరి కొందరిని చేర్పించినట్లు సమాచారం. ఇక పట్టణానికి చెందిన ఓ వ్యాపారి సైతం రూ. 4 లక్షల వరకు పెట్టినట్లు సమాచారం. ఇలా చాలా మంది పెట్టుబడి పెట్టి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.