ఎమ్మెల్యే వేధింపులపై జాతీయ మహిళా కమిషన్ కు షేజల్
Orison’s Diary: ఆరిజన్ డైరీ వ్యవహారంలో తనను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్న ఆ సంస్థ నిర్వాహకురాలు షేజల్ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మను కలిశారు. ఎమ్మెల్యే తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారని షేజల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాను ఎన్నిమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించిన షేజల్ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ చైరపర్సన్ రేఖా శర్మ గురువారం అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఈరోజు వెళ్లి ఆమెకు తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించారు.
కాగా, షేజల్ విడుదల చేస్తున్న వీడియోలతో పాటు తాజాగా రెండు రోజుల కిందట మరో వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో బిజినెస్ పేరుతో పిలిచి మందు పార్టీ ఏర్పాటు చేశారని తెలిపింది. ఎమ్మెల్యే క్వార్టర్లలో 404 నంబర్లో సిట్టింగ్ ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది. తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలు పోలీసులు డిలేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయినా, తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ను కలిసిన షేజల్ తన వద్ద ఉన్న వాటిని వారికి అందచేసింది.