కేసీఆర్కు బీజేపీ అడ్వాన్స్ పంచ్
రేపు జిల్లా కేంద్రాల్లో బీజేపీ ధర్నాలు - తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆందోళనలు - టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయం
హైదరాబాద్ – రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద గురువారం ధర్నాలు చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చేదాకా రైతుల పక్షాన నిలిచేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని వరి ధాన్యాన్ని కేంద్రం కొనేందుకు సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదనే అంశంపై నిలదీస్తామని ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన బుధవారం జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతోపాటు వివిధ మోర్చాల అధ్యక్షులు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో పార్టీ సంస్థాగత పటిష్టత, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు. వానాకాలంలో పండించిన 60 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనేందుకు సిద్దమని కేంద్రం గత ఆగస్టులోనే లేఖ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని దుయ్యబట్టారు. రైతులను ఇబ్బంది పెడుతూ ఆ తప్పును కేంద్రంపై నెట్టే యత్నం చేయడాన్ని ఖండించారు. దొంగే దొంగ అన్నట్లుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ధర్నాల పేరుతో రైతులను మరింత ఆందోళనకు గురిచేయడాన్ని తప్పుపట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంతోపాటు వరి ధాన్యం తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జిల్లా కలెక్టరేట్ల వద్ద గురువారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
– వానా కాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ విషయంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా ఇచ్చింది. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందికి గురిచేస్తోంది. పైగా కేంద్రం కొనడం లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు చేస్తున్న ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు.
– ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు, రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాల్సిన బాధ్యత బీజేపీ నేతలపై ఉంది. వాస్తవానికి కేంద్రం ధాన్యం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనేందుకు నిధుల్లేవు. గతంలో తీసుకున్న అప్పులు కూడా చెల్లించలేదు. దీంతో ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేసి రాజకీయ లబ్ది పొందాలనే కుట్రతోనే ధర్నాల పేరుతో కొత్త డ్రామాలకు తెరదీసింది.
– రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలి. ఈ ధర్నాలో బీజేపీ నేతలతోపాటు మహిళ, యువ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కిసాన్ మోర్చాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలి.
– కేంద్రం వానాకాలంలో పండించిన ధాన్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నా…రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సేకరించడం లేదో ఈ ధర్నాలో నిలదీయాలి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంవల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించాలి.
– నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్రం ధాన్యం కనీస మద్దతు ధర రూ.1960గా నిర్ణయించడంతోపాటు రవాణా ఛార్జీలు, గోడౌన్లలో నిల్వ ఛార్జీలు, గోనె సంచులు, చివరకు సుతిలీ తాడు ధాన్యం సేకరణకయ్యే ప్రతి పైసా చెల్లిస్తున్న విషయాన్ని అర్ధమయ్యేలా వివరించాలి. రైతుల నుండి ధాన్యం సేకరించి కేంద్రానికి అప్పగిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తున్న విషయం రైతులకు తెలియాల్సిన అవసరం ఉంది.
– అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనడం లేదనే అంశంపై ధర్నా ద్వారా నిలదీయాలి.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాసులు, ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, శోభారాణి తదితరులు హాజరయ్యారు.