కేసీఆర్‌ను కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ముంచేద్దాం

-ఆదివాసీలు, గిరిజనులకు పోడు పట్టాలిస్తాం
-ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు క‌ట్టి తీరుతాం
-సింగ‌రేణి బొగ్గు గ‌నులు సింగ‌రేణికే కేటాయిస్తాం
-ఆ ఉద్యోగాల‌కు స్థానికుల‌కే అందిస్తాం
-మంచిర్యాల జై భారత్ సత్యాగ్రహ సభలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క

Mallu Bhatti Vikramarka: ప్ర‌జ‌ల‌కు అనేక భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, వారిని మోసం చేశార‌ని ఆయ‌న‌ను కాళేశ్వరం ప్రాజెక్టులో ముంచేద్దామ‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క కోరారు. ఆయ‌న మంచిర్యాలలో నిర్వ‌హించిన జై భారత్ సత్యాగ్రహ సభలో పాల్గొని ప్ర‌సంగించారు. ప్రాణహిత ప్రాజెక్టును బొందపెట్టి ఈ జిల్లా సస్యశ్యామలం కాకుండా చేసి, కాళేశ్వరం పేరుతో జిల్లాను ముంచుతున్న ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ముంచాలని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేశామ‌న్నారు. మంచిర్యాల సభ దేశానికి దశదిశ నిర్దేశం చేస్తోందన్నారు. మూడు ఎకరాల భూమి, దళిత బంధు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అనేక భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. బొగ్గు బావుల్ని అమ్ముకుంటున్నాడ‌ని, వెట్టిచాకిరి నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను సైతం ధరణి పేరుమీద వెనక్కి లాక్కుని పేదవాళ్లకు భూములు లేకుండా చేస్తున్నాడని భ‌ట్టి దుయ్య‌బ‌ట్టారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వనరులున్నాయి. పచ్చటి ప్ర‌కృతి ఉంది, మనసు నిండా ప్రేమించే గిరిజన బిడ్డలున్నారన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నాక ఆదిలాబాద్ బిడ్డలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానంగా పోడు భూముల సమస్య ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములను పట్టాలిచ్చి పంచిందని గుర్తు చేశారు. మా భూములు మాకే, మా సంపద మాకే, మా ఉద్యోగాలు మాకే అని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త భూములు పంచకపోగా పంచిన వాటిని కూడా లాక్కొంటున్న ఘటనలు ప్రతి గ్రామంలో చెబుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆదివాసీలకు, గిరిజనులకు, పోడు భూముల పట్టాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కడతాం.. ఆదిలాబాద్ జిల్లా భూములను నీళ్లు పారిస్తామ‌ని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క హామీ ఇచ్చారు.

సింగరేణి తెలంగాణ పాలిట ఉద్యోగాల గని అని, మనం పోరాటాలు చేసింది కూడా ఉద్యోగాల కోసమేనని చెప్పారు. ఒకప్పుడు సింగరేణిలో లక్ష 5 వేల ఉద్యోగాలుంటే ఇప్పుడు 42 వేలకు కుదించి, అనేక బొగ్గు బావుల్ని ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమ‌ని, ఈ సంపద మనది ఈ ఉద్యోగాలు మనవి అని భ‌ట్టి స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి అన్ని ప‌నులు ప్రైవేటుకు ఇవ్వడం వల్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేక ఎస్పీ, ఎస్టీలు ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంత బొగ్గు గనుల్ని సింగరేణికే ఉంచుతామ‌ని, ఉద్యోగాలన్ని స్థానికులకే ఇస్తామ‌ని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామ‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క వెల్ల‌డించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామ‌ని, ప్రతి పేద వాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామ‌న్నారు. ఫారెస్ట్ రైట్ యాక్ట్ పక్కాగా అమలు చేస్తామ‌ని, సింగరేణి ఉద్యోగాలు స్థానికులకే ఉండేలా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్య‌మ‌న్నారు. మతోన్మాద శక్తుల చేతుల్లోంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం రాహుల్ గాంధీ నడుస్తుంటే భయపడి బీజేపీ ఆయనపై తప్పుడు కేసులు పెట్టి, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిందని, ఇది దుర్మార్గమైన కుట్ర అని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like