సస్పెన్షన్‌ ఎత్తివేత..

IPS Officer Anjani Kumar:ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీకుమార్ విజ్ఞప్తిని ఈసీ పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన సీఈసీ.. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.

తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి రోజు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. గతనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. పూర్తిస్థాయిలో కౌంటింగ్ పూర్తికాకముందే తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తికాకముందే డీజీపీ హోదాలో రేవంత్ రెడ్డిని కలవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీగా ఉన్న అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటువేసింది. ఆయ‌న‌తో పాటు వెళ్లిన ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

దీనిపై ఈసీకి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని, ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని, మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్ ఈసీకి వివరణ ఇచ్చారు. దీంతో ఆయన వివరణకు సంతృప్తి చెందిన ఈసీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అంజనీకుమార్ స్థానంలో రవిగుప్తాను డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అంజ‌నీకుమార్‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తేసిన నేప‌థ్యంలో ఆయన్ను మళ్లీ డీజీపీగా నియమిస్తారా? లేక ఏ పోస్టు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like