త‌గ్గేదేలే..

-ఏసీబీ కోర్టులో జోరుగా వాదనలు
-ఇరువైపులా వాదిస్తున్న లాయ‌ర్లు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు పై ఉదయం 9 గంటల నుంచి విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఓపెన్ కోర్టులో వాదనలు వినాలని కోర్టుకు చంద్రబాబు నాయుడు తరఫు లాయర్ల బృందం విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి కోర్టును సానుకూలంగా స్పందించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం, ప్రభుత్వం తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తున్నారు. ఉదయం 10.30కి చిన్న బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ 11 గంటలకు వాదనలు కొనసాగాయి. ఐతే.. బ్రేక్‌కి ముందు, తర్వాత కూడా వాదనలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అటు చంద్రబాబు, ఇటు సీఐడీ తరపు లాయర్లు వెనక్కి తగ్గకుండా.. బలంగా తమ వాదనలు వినిపిస్తున్నారు.

సెక్షన్ 409 కింద వాదనలు ప్రారంభం కాగా.. దీనిపై చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సెక్షన్ సరికాదని అన్నారు. మరోవైపు, ఈ కేసులో తన వాదనలు వినాలన్న చంద్రబాబు కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించడంతో చంద్ర‌బాబు మాట్లాడారు. రాజకీయ కక్షతోనే త‌న‌పై కేసు నమోదుచేశారని, తాను ఏ తప్పూ చేయలేదని చంద్రబాబు వాదించారు. శనివారం ఉదయం 5.40 గంటలకు పోలీసులు నోటీలు ఇచ్చారని, ఇవాళ ఉదయం 5.04 గంటలకు రిమాండ్ రిపోర్టు ఇచ్చారన్నారు. హాలులో ఉంటారా? బయటకు వెళ్తారా? అని న్యాయమూర్తి అడిగితే.. వాదోపవాదాలు ముగిసే వరకూ తాను కోర్టులో ఉంటానని చెప్పారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని బాబు అన్నారు. బ్రేక్‌కి ముందు చంద్రబాబు పేరు FIRర్‌లో ఎందుకు లేదని జడ్జి ప్రశ్నించారు. FIR నమోదులో ఆలస్యానికి కారణాలు అని జడ్జి అడిగినట్లు తెలిసింది. చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయా అని జడ్జి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలా న్యాయమూర్తి అడిగే ప్రతీ ప్రశ్నకూ రిమాండ్‌ రిపోర్ట్‌ ద్వారా సీఐడీ తరపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ వివరాలు అందిస్తూ, తమ వాదన వినిపిస్తున్నారు.

దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘ వాదోపదాలు జరిగాయి. ప్రస్తుతం భోజన విరామం తీసుకున్నారు. గంట పాటు న్యాయమూర్తి విచారణకు విరామం ఇచ్చారు. తిరిగి మళ్లీ మధ్యాహ్నం 1.30 గంటలకు విచారణ ప్రారంభం కాగా.. సీఐడీ తరఫున ఏఏజీ పి సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

అంతకుముందు… విజయవాడ సిట్ ఆఫీసులో దాదాపు 10 గంటలు పాటూ చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకూ ఈ విచారణ సాగింది. మధ్యలో రాత్రి 11 గంటలకు కొద్దిసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబుని భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, బాలకృష్ణ, బ్రాహ్మణి కలిసి మాట్లాడారు. తెల్లవారుజాము 3 గంటల తర్వాత చంద్రబాబును విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి GGHకి తరలించారు. దాదాపు 10 మంది డాక్టర్ల టీమ్.. చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించింది. దాదాపు 45 నిమిషాలపాటూ వైద్య పరీక్షలు జరిగాయి. వైద్య పరీక్షల తర్వాత ఉదయం 4.30కి చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టుకి కాకుండా.. సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఓ గంటపాటూ ఉంచిన అధికారులు.. తర్వాత ఏసీబీ కోర్టుకి తరలించారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like